Begin typing your search above and press return to search.

ఏడాదికి రూ.10వేల పెట్టుబడి.. రిటైర్మెంట్ నాటికి రూ.10కోట్లు.. ఏమిటీ స్కీమ్?

అవును... 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో ఎన్.పీఎస్. వాత్సల్య ఖాతాను తల్లితండ్రులు లేదా గార్డియన్ తీసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 11:30 PM GMT
ఏడాదికి రూ.10వేల పెట్టుబడి.. రిటైర్మెంట్  నాటికి రూ.10కోట్లు.. ఏమిటీ స్కీమ్?
X

తమ పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం ఎన్.పీ.ఎస్. వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తాజాగా ప్రారంభించారు. బడ్జెట్ లో ప్రకటించిన ఈ పథకం... మదుపు అలవాట్లను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని అన్నారు. 18 ఏళ్ల లోపు బాలబాలికల పేరుతో తల్లితండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ తీసుకోవచ్చు.

అవును... 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో ఎన్.పీఎస్. వాత్సల్య ఖాతాను తల్లితండ్రులు లేదా గార్డియన్ తీసుకోవచ్చు. సదరు పిల్లలకు మైనార్టీ తీరిన తర్వాత ఈ అకౌంట్ టైర్-1 అకౌంట్ గా మారుతుంది. దేశ పౌరులను లాంగ్ టెర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, సెక్యూరిటీ ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. కనిష్టంగా రూ.1,000 తో ఈ అకౌంట్ తెరవొచ్చు.

పీఐబీ చండీగఢ్ తన ఎక్స్ లో వెల్లడించిన వివరాల ప్రకారం... ఏడాదికి రూ.10 వేల చొప్పున 18 ఏళ్ల పాటు మదుపూ చేస్తే.. 18వ ఏడాది 10% రాబడి అంచనాతో రూ.5 లక్షలు సమకూరుతుంది. ఇదే రిటైర్మెంట్ ఏజ్ (60 ఏళ్లు వచ్చేసరికి) 10% రాబడి అంచనాతో రూ.2.75 కోట్లు.. 11.59% రాబడి అంచనాతో రూ.5.97 కోట్లు, 12.86% రాబడి అంచనాతో రూ.11.05 కోట్లు పొందవచ్చు!

ఇక ఈ ఎన్.పీ.ఎస్. వాత్సల్య ఖాతాను ఆన్ లైన్ లో తెరవాలంటే ఎన్.పీ.ఎస్. వెబ్ సైట్ సాయంతో తెరవచ్చు. ఆ వెబ్ సైట్ లో ఎన్.పీ.ఎస్.పై క్లిక్ చేయగానే ఎన్.పీ.ఎస్. వాత్సల్య అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ మొదలైన వివరాలను సమర్పించాలి. అనంతరం బిగిన్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. అనంతరం ఓటీపీ రాగానే అది ఎంటర్ చేసి ఖాతా తెరవచ్చు.

ఎడ్యుకేషన్ కోసమో, హెల్త్ మొదలైన అవసరాలకోసం అడ్వాన్స్ విత్ డ్రా సదుపాయం కూడా ఇస్తున్నారు. దీనికోసం కనీసం మూడేల్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత 25 శాతం వరకూ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుంది. దీనికి గరిష్టంగా మూడుసార్లు అనుమతిస్తారు. ఈ పథకం వల్ల చక్రవడ్డీ ప్రయోజనం కూడా పొందవచ్చు.

ఇదే సమయంలో... ఈ ఎన్.పీ.ఎస్. వాత్సల్య పథకంలో చేరిన వారు 18 ఏళ్లు వచ్చిన తర్వాత స్కీమ్ నుంచి వైదొలగాలంటే.. ఆ సదుపాయమూ ఉంది. అప్పటికి సమకూరిన మొత్తం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉంటే మొత్తం విత్ డ్రా చేసేసుకోవచ్చు. అదే మొత్తం రెండున్నర లక్షల కంటే ఎక్కువ ఉంటే.. 80% యాన్యుటీ స్కీమ్ లో పెట్టాల్సి ఉంటుంది.. 20% మాత్రం విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది.