Begin typing your search above and press return to search.

కూటమికి శల్య సారధులు ఎందరో ?

ఇక్కడ మూడు పార్టీలు అంటే మూడు రెట్లు ఎక్కువ కష్టాలు అన్నది కూడా అనుకోవాలి.

By:  Tupaki Desk   |   23 April 2024 3:34 AM GMT
కూటమికి శల్య సారధులు ఎందరో ?
X

కూటమి అంటేనే వైవిద్యాల పుట్ట అని చెప్పాలి. విభిన్న భావనలు కలిగిన వారు అంతా ఒక్క చోట చేరి ఒకటిగా మారి జనం వద్ద ఓట్లు తీసుకుని అధికారం అందుకోవాలంటే చాలా టఫ్ ఫీట్ అది. ఒక్క పార్టీగా ఉంటేనే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆశావహులు ఒకటికి మించి ఉంటారు. వారికి నచ్చచెప్పలేక వైసీపీ పడుతున్న కష్టాలు అంతా చూస్తున్నారు.

ఇక్కడ మూడు పార్టీలు అంటే మూడు రెట్లు ఎక్కువ కష్టాలు అన్నది కూడా అనుకోవాలి. అలాంటి కూటమిని ఏకీకృతం చేసి జనం వద్దకు తీసుకెళ్లడం చాలా బిగ్ టాస్క్. ఆ పనిలో చంద్రబాబు తన పూర్తి కష్టం అనుభవం అంతా వెచ్చిస్తున్నారు. ఆయనకు కూడా గతంలో మాదిరిగా పట్టు దొరకడం లేదు. ఇదివరకులా రాజకీయం కూడా లేదు.

బాబు గతంలో చెబితే సరేనని ఊరుకునే వారు తమ్ముళ్ళు. ఈసారి అలా కాదు, పట్టుబడుతున్నారు. కాదు అంటే రివర్స్ అవుతున్నారు. బహుశా వారి కోణంలో నుంచి ఆలోచిస్తే వారికి కూడా ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ మాదిరిగానే ఉన్నాయి. దాంతో ఎవరూ తగ్గడం లేదు.

ఈసారి ఎన్నికలు తొలి విడతలో కాకుండా నాలుగవ విడతలో జరగడం వల్ల కావాల్సినంత కూటమికి సమయం దొరికిందని హ్యాపీగా అన్నీ చక్కబెట్టుకోవచ్చు అని అనుకున్న నేపధ్యంలో దానికి భిన్నంగా పరిస్థితి సాగుతోంది. అలకలు అసంతృప్తులు అలా కొనసాగుతూ వస్తున్నాయి.

ఈ చికాకులతో బాబు సమయం అంతా పోతూంటే కూటమికి కొమ్ము కాస్తామంటూ వచ్చిన వారు చేస్తున్న శల్య సారాధ్యం వల్ల మరిన్ని కొత్త చిక్కులు వస్తున్నాయి. ఎన్నారైలు టీడీపీ విజయాన్ని ఈసారి బలంగా కాంక్షిస్తున్నారు. వారు ఈసారి పసుపు జెండా ఎగరాల్సిందే అని కూడా పట్టుబట్టి ఉన్నారు.

అలాంటి వారు తాము చేయాల్సిందేదో చేతలలో చూపించాలి. కానీ వారి చేతల కంటే మాటలే ఎక్కువ అయ్యాయి. అవి కూడా కూటమికి మరీ ముఖ్యంగా టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. కోమటి జయరాం అన్న మాటలను ఎవరైనా సమర్ధించగలరా అని అంటున్నారు.

ఓటరుని పట్టుకుని వెధవలు అంటున్నారు. ఈ వెధవ ఓటు వేయడు అని తెలుసు. కానీ వాడిని లోబరచుకోవాలి, ప్రలోభాలకు గురి చేయాలి. మొత్తానికి దారికి తేవాలి ఈ మాటలు అంటున్నది అభివృద్ధి చెందిన దేశం నుంచి వచ్చిన పెద్ద మనిషి. తాము అభివృద్ధి చెందామని ఎంతో ముందు ఉన్నామని భావించుకునే ఒక మనిషి అంటున్నవి.

ఏపీలోనే కాదు ఎక్కడైనా ఓటరు ఓటరే. ఓటరుకి దక్కే గౌరవం అయిదేళ్ళకు ఒక్కసారే. అలాంటి ఓటరుని పట్టుకుని వెధవ అనడమేంటి. దీని వల్ల కూటమికి సాయం చేస్తున్నారా లేక షాకులు తినిపిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. పైగా డబ్బుల ప్రస్తావన తెస్తున్నారు. అంటే ఏపీలో ఎన్నికలు ఎలా జరుగుతాయో ఐడియా ఉందో లేదో తెలియదు కానీ డబ్బుతో ఏదైనా కొనవచ్చు అన్న తీరుతో మాట్లాడుతున్న వైఖరిని చూసిన వారు ఆ వీడియోలు లీక్ అయ్యాక చూసిన వారు మండిపోయేది కోమటి మీద కాదు కూటమి మీద.

ఇలాంటి వారు కూటమికి ఏమి సాయం చేస్తారు అని కూడా అంటున్న నేపధ్యం ఉంది. ఇక అప్ప ఆరాటమే కానీ అన్నట్లుగా టీడీపీకి ఉన్న సలహాదారులు వ్యూహకర్తలు ఇస్తున్న సూచనలు కూడా పేలవంగా ఉంటున్నాయి. జగన్ మీద జరిగిన రాళ్ల దాడి ఎపిసోడ్ లో టీడీపీ పడుతున్న పాట్లు కోరి మరీ దూరి అంటించుకుంటున్న వైనాలు చూసిన వారు ఏమిటీ అనుభవం ఇంతేనా అనుకునే నేపధ్యం ఉంది.

అదొక్కటే కాదు, ప్రతీ ఇష్యూ మీద కూడా ఇలాగే దొరికిపోతున్న తీరు. మాట్లాడితే అధికారులను బదిలీ చేయమని టీడీపీలో ఒక కీలక పార్టీ పదవిలో ఉన్న మాజీ పోలీసు అధికారి చేస్తున్న డిమాండ్లు చూసిన వారు ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించాలి. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారు అని ఇప్పటికే వైసీపీ అంటోంది. దానికి తగినట్లుగా ఈ డిమాండ్లు ఉంటున్నాయి.

మరో వైపు టీడీపీకి సాయం చేయబోయి వాలంటీర్ల వ్యవస్థ వద్దు అని ఈసీకి లేఖ రాసి కొంప ముంచిన మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ఇక టీడీపీ కూటమిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా ఇస్తున్న స్పీచులు అందులో పేలవంగా ఉంటున్న విమర్శలు. అంతేకాదు ఆయన స్పీచులలో మరణించిన నటులను కూడా ముందుకు తెచ్చి కొత్త వివాదాలు రేపడం.

ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి విజయం కోసమేనా అంతా పనిచేస్తున్నది అని అనిపించక మానదు. అదేదో సినిమాలో రావు రమేష్ అన్నట్లుగా శత్రువులు ఎక్కడో లేరని అన్న మాట కూటమికి బాగా సరిపోతుందేమో. పుణ్యకాలం చూస్తే చాలా తక్కువగా ఉంది. రిపేర్లు బోలేడు ఉంది. ఈ కూటమి బండి బ్రేకులు లేకుండా జోరందుకునే మార్గముందా అంటే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ఏమి సలహా ఇస్తాడో ఏమో.