మొట్టమొదటి సారిగా టీటీడీ బోర్డులో ఎన్నారైల ఎంట్రీ..!?
అవును... ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నారైలు చాలానే కష్టపడ్డారని చెప్పుకోవాలి.
By: Tupaki Desk | 9 Aug 2024 6:23 AM GMTగతంలో ఎన్నడూ లేని విధంగా, మొట్ట మొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నారైలకు చోటు కల్పించనున్నారని.. బోర్డు సభ్యులుగా వారిని నియమించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే చర్చ ఇప్పుడు పార్టీలో బలంగా వినిపిస్తుందని అంటున్నారు. తప్పకుండా ఇవ్వాలనా.. లేక ఇవ్వడం తప్పడం లేదనా అన్నది తెలియదు కానీ... సుమారు 4 నుంచి 5 మంది ఎన్నారైలను టీటీడీ బోర్డులోకి తీసుకోనున్నారని అంటున్నారు.
అవును... ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నారైలు చాలానే కష్టపడ్డారని చెప్పుకోవాలి. చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ లో మీటింగులు పెట్టి మరీ ప్రచార కార్యక్రమాలు ఎలా చేయాలో, జనాలను ఎలా నమ్మించాలో, మెప్పించాలో కార్యకర్తలకు ట్రైనింగ్ లాంటివి కూడా ఇచ్చారు. ఈ సమయంలో వారిలో ఓ నలుగురైదుగురు టీటీడీ బోర్డులో సభ్యులు కావాలని భావిస్తున్నారని అంటున్నారు.
పైగా ఇతర పదవులపై వీరికి మక్కువ లేదని.. కొండపై పదవులపైనే ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో... గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు చెందిన ఇద్దరు స్నేహితులు ఉన్నారని భారీగా ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో కోమటి జయరాం వర్గీయులు కూడా ఓ ఇద్దరు ఈ పదవుల కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
పైగా ఈ ఇద్దరూ చంద్రబాబుకు బాగా కావాల్సిన వారని అంటున్నారు. దీంతో.. వీరి మాట కొట్టేయలేని పరిస్థితి చంద్రబాబుది అనే చర్చా నడుస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఓ కీలక నేత సతీమణి కూడా ఈ రేసులో ఉన్నారనే చర్చ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతోందని తెలుస్తోంది. దీంతో.. ఆమె ను కూడా చంద్రబాబు కాదనలేని పరిస్థితే అని అంటున్నారు.
ఈ విధంగా సుమారు నలుగురు నుంచి ఐదుగురు ఎన్నారైలు బోర్డులో సభ్యత్వం ఆశిస్తుండగా.. చంద్రబాబు కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే... గతంలో ఎప్పుడూ ఇలా ఎన్నారైలకు టీటీడీ బోర్డులో సభ్యత్వాలు ఇవ్వలేదు. కానీ... ఈసారి చంద్రబాబుకు తప్పడం లేదని, వారిని సిఫార్సు చేసేవారిని కాదనలేరని అంటున్నారు!
ఈ నేపథ్యంలో ఆ నలుగురైదుగురిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోపక్క టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఓ మీడియా అధినేత పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు చైర్మన్ తో పాటు సభ్యులను ఒకేసారి నియమించనున్నారని.. త్వరలో దీనికి ముహూర్తం పెట్టనున్నారని అంటున్నారు!