అమెరికాలో "జై శ్రీరాం"... ఆసక్తికరంగా ఎన్నారైల సందడి!
శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jan 2024 9:20 AM GMTశ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోట్ల హృదయాలు శ్రీరామ నామంతో నిండిపోతున్నాయి! సుమరు 500 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ కోట్లమంది హిందువుల హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నాయి.
ఈ క్రమంలో స్వదేశంలోనే కాదు.. విదేశాల్లో నివసించే వారితో సహా ప్రతి భారతీయుడు రామ్ లల్లా పవిత్రోత్సవ సంబరాల్లో మునిగిపోతున్నారు. తామున్న చోట ఎక్కడికక్కడ రామాలయాలను సందర్శిస్తున్నారు.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఫలితంగా "జై శ్రీరాం" నినాదాలతో ప్రపంచమంతా ఒక్కసారిగా మారుమ్రోగుతుంది. ఈ సమయంలో ఎన్నారైలు ఈ వేడుకను ఘనంగా స్వాగతించారు.
అవును... ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు ప్రాణ ప్రతిష్ఠను స్మరించుకుంటున్నారు. భారతీయ సంస్కృతి, సామరస్యం యొక్క నిజమైన స్ఫూర్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో... యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియా కూడా జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగిపోయింది. అక్కడున్న భారతీయులు భజనలు, శ్రీరామ కీర్తనలు, కాషాయ జెండాలతో ప్రాణ ప్రతిష్ఠను స్మరించుకోవడానికి తరలివచ్చారు.
ఇందులో భాగంగా... అమెరికాలోని కాలిఫోర్నియా నగరం రామమందిర ప్రతిష్ఠాపనకు ముందు కాషాయమయం అయిపోయింది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, వీధులు, పరిసర ప్రాంతాలన్నింటా శ్రీ రాముడి ముద్రలను కలిగి ఉన్న కాషాయ జెండాలు రెపరెప లాడుతూ కనిపించాయి. అమెరికాలో ఉన్న ఎన్నారైలంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలుస్తుంది.
అయోధ్యలో రాం లల్ల ప్రాణ ప్రతిషట రోజున అమెరికాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా స్వాగతించాలని.. ఒక మధుర జ్ఞాపకంగా తీర్చిదిద్దాలని వారు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.