Begin typing your search above and press return to search.

15 దాటితే ఫోను, 18 దాటితే అప్పు.. తెలంగాణపై సర్వేలో సంచలన విషయాలు!

ఈ మేరకు జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్.ఎస్.ఎస్.వో) తాజాగా తన సర్వే నివేదికను వెల్లడించింది.

By:  Tupaki Desk   |   2 Nov 2024 5:52 AM GMT
15 దాటితే ఫోను, 18 దాటితే అప్పు.. తెలంగాణపై సర్వేలో సంచలన విషయాలు!
X

స్మార్ట్ ఫోన్లు, అప్పులు, చదువులు, ఆరోగ్య సమస్యలు, అక్షరాస్యత, ఇంటర్నెట్ వినియోగం... ఇలా మొదలైన అంశాలపై తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై ఓ ఆసక్తికర సర్వే తెరపైకి వచ్చింది. ఈ మేరకు జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్.ఎస్.ఎస్.వో) తాజాగా తన సర్వే నివేదికను వెల్లడించింది.

అవును... తెలంగాణలో కొన్ని పరిస్థితులపై ఆసక్తికర నివేదికను జాతీయ శాంపుల్స్ సర్వే సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో 8,758 గ్రామాలు.. 6,540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై ఈ సర్వే నిర్వహించినట్లు తెల్లిపింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులనూ విశ్లేషించింది.

చదవడం, రాయడం:

ఇందులో భాగంగా... తెలంగాణలో 15 నుంచి 24 ఏళ్ల మధ్యలోపు యువతలో 99.2 శాతం మంది పురుషులకు.. 98.3 శాతం మంది మహిళలకు చదవడం, రాయడంతో పాటు రోజువారీ లెక్కలు చేసే సామర్ధ్యం ఉందని తెలిపింది. ఈ లెక్క... జాతీయ స్థాయిలో పురుషుల్లో 97.8 శాతం.. మహిళల్లో 98.9 శాతంగా ఉందని వెల్లడించింది.

బ్యాంక్ అకౌంట్:

ఇదే క్రమంలో... 18ఏళ్లు పైబడిన వారిలో 97.5 శాతం మంది ఇండివిడ్యువల్ లేదా కంబైన్డ్ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నారని.. వీరి సంఖ్య పట్టణాల్లో 96.9 శాతంగా ఉండగా.. అంతకంటే ఎక్కువగా గ్రామాల్లో 98శాతం మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని వెల్లడించింది.

స్కూల్స్ కి వెళ్తున్నవారు!:

అదేవిధంగా... తెలంగాణ రాష్ట్రంలో 6 నుంచి 10 ఏళ్ల లోపు చిన్నారుల్లో 94శాతం మంది బడికి వెళ్తుండగా... వారి సంఖ్య పట్టణాల్లో 93.4 శాతంగా, గ్రామాల్లో అంతకంటే ఎక్కువగా 94.9 శాతంగా ఉంది. ఇక బాలురు, బాలికలుగా పరిశీలిస్తే... స్కూల్స్ కి వెళ్తున్న బాలురు 94.1 శాతంగా ఉండగా అంతకంటే ఎక్కువగా బాలికలు 94.5 శాతం ఉన్నారు.

కెరీర్ విషయంలో..:

ఇక కెరీర్ పై ఆసక్తి విషయానికొస్తే... 21 నుంచి 35 ఏళ్లు ఉన్న యువతలో గరిష్టంగా 66.3 శాతం మంది సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు చదువుతుండగా.. వీరి సంఖ్య పట్టణాల్లో 71.5 శాతంగా.. గ్రామాల్లో 58.2 శాతంగా ఉంది.

స్మార్ట్ ఫోన్ వినియోగం:

ఇదే సమయంలో... సెల్ ఫోన్, ఇంటర్నెట్ ల విషయానికొస్తే... తెలంగాణలో 15 ఏళ్లు పైబడినవారిలో పురుషుల్లో 96.4 శాతం, మహిళల్లో 88.2శాతం వెరసి సగటున నూటికి 92.3 మందికి స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన ఉంది. ఈ సంఖ్య పట్టణాలో 94.5 శాతంగా ఉండగా.. గ్రామాల్లో 90.7 శాతంగా ఉంది.

ఇంటర్నెట్ వినియోగించే స్కిల్స్:

ఇంటర్నెట్ విషయానికొస్తే... దీన్ని వినియోగించే స్కిల్స్ రాష్ట్రవ్యాప్తంగా 64.8 శాతం మందికి మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య పట్టణాల్లో 78.9 శాతంగా ఉండగా.. గ్రామాల్లో 54.8 శాతంగా ఉంది. అయితే.. ఇది జాతీయ సగటు (49.8 శాతం) తో పోలిస్తే ఎక్కువే.

18 ఏళ్లు దాటితే అప్పులు!:

అదేవిధంగా... రాష్ట్రంలోని 18 ఏళ్లు పైబడిన వారిలో ప్రతీ లక్ష మందికి 42,407 మందికి అప్పు / చేబదులు ఉందని తాజా నివేదిక వెళ్లడించింది. గ్రామీణ ప్రాంతల్లో వీరి సంఖ్య ప్రతీ లక్షమందిలో 50,289గా ఉండగా.. పట్టణాల్లో 31,309 గా ఉంది. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య గ్రామాల్లో 18,714.. పట్టణాల్లో 17,442గా ఉంది.

వైద్య ఖర్చులు!:

ఇదే క్రమంలో... తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రతీ కుటుంబానికీ సగటున అవుతున్న ఖర్చు గ్రామాల్లో రూ.5,088 గా ఉండగా.. పట్టణాల్లో రూ.5,648గా ఉంది. జాతీయ సగటు ఖర్చు రు.4,496 తో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంది!