ఎన్టీఆర్ కే కాదు.. ఈ ఏడాదికి ఇక ఎవరికీ భారత రత్న లేనట్లే?
ఇక రాజకీయ రంగంలోనూ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రకెక్కారు.. కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెకిలించారు.
By: Tupaki Desk | 27 Feb 2025 11:51 AM GMTతెలుగువారి అన్న గారు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్).. సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ ఆయనది చెరిగిపోని రికార్డు.. సినిమాల్లో నటించాలని నిమ్మకూరు నుంచి మదరాసుకు వెళ్లి.. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోస్తే అచ్చం ఇలానే ఉంటారు అన్నట్లుగా నటించి.. తెలుగువారి అభిమాన హీరోగా ఎదిగి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో జీవించారు ఎన్టీఆర్.
ఇక రాజకీయ రంగంలోనూ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రకెక్కారు.. కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెకిలించారు. తనదైన సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుని.. సంక్షేమానికి చిరునామాగా నిలిచారు.
అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తెచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు. ఓ విధంగా చరిత్రను తిరగరాశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న నాయకుల్లో సగంపైగా ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశం టికెట్ అందుకున్నవారేనంటే నమ్మక తప్పదు. లేదా కాలక్రమంలో తెలుగుదేశంలో చేరినవారే.
విపరీతమైన ప్రజాదరణ.. అంతకుమించిన రికార్డులు ఉన్న అంతటి ఎన్టీఆర్ కు ఒక్కటే లోటు. అదే ఆయన స్థాయిని గుర్తించే అవార్డు ఏదీ రాకపోవడం. సినీ రంగంలోనూ ఎన్టీఆర్ కు దేశంలోని పౌర పురస్కారాల్లో మొదటిది అయిన ‘పద్మ శ్రీ’ మాత్రమే దక్కింది.
1980ల ప్రారంభంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం.. అప్పటి అధికార కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా నిలవడంతో ఆయనకు మరే ఇతర అవార్డులు దక్కలేదు అనుకోవాలి. 1996 నాటికి ఎన్టీఆర్ కాలం చేశారు.
మహోన్నత వ్యక్తి, యుగ పురుషుడు అయిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘భారత రత్న’’ ఇవ్వాలనేది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. కానీ, దాదాపు మూడు దశాబ్దాలుగా అది డిమాండ్ గానే మిగిలిపోయింది.
వేర్వేరు కారణాల రీత్యా ఎన్టీఆర్ కు భారత రత్న రాలేదనేది వాస్తవం. అయితే, ఈ ఏడాది మాత్రం ఈ విషయంలో ఆయనకు అన్ని సానుకూలతలు కనిపించాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కీలక మద్దతుదారు తెలుగు దేశం పార్టీ కావడంతో పాటు కాలం కూడా కలిసివచ్చినట్లుగా కనిపించింది. అయితే, కేంద్రం మరోసారి నిరాశపరుస్తూ ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటించలేదు.
వాస్తవానికి 2024లో ఎన్నికల ముంగిట కేంద్ర ప్రభుత్వం తెలుగువారైన పీవీ నరసింహారావు, బీజేపీ అగ్ర నేత ఆడ్వాణీ సహా ఐదుగురికి భారత రత్న ఇచ్చింది మోదీ సర్కారు. 2019 తర్వాత ఒకేసారి ఐదుగురికి అవార్డు ప్రకటించింది.
కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ కే కాక ఎవరికీ భారత రత్న ఇవ్వనట్లేనని తెలుస్తోంది. నిరుడు 15 రోజుల్లో ఐదుగురికి అవార్డు ఇచ్చింది. అది కూడా ఫిబ్రవరిలోగానే ఇచ్చింది. ఇప్పుడు మార్చి నెల కూడా వస్తోంది. ఇంత ఆలస్యంగా ప్రకటన చేస్తారా? అనేది చూడాలి.
2019 తర్వాత నిరుడు భారత రత్న ప్రకటించినా.. అన్నీ 2024 సంవత్సర కేటగిరీలోనే చూపారు. ఇప్పుడు 2025లో ఇవ్వాలి. పైగా ఈ ఏడాదే తెలుగు హీరో, ఎన్టీఆర్ కుమారుడు బాలక్రిష్ణకు పద్మ భూషణ్ ఇచ్చారు.
ఇప్పటికైతే ఎన్టీఆర్ కు భారత రత్న రానట్లే. వచ్చే ఏడాది ఏమైనా అవకాశం ఉంటుందేమో? చూడాలి.