Begin typing your search above and press return to search.

వ్యక్తిత్వ హననం...ఎన్టీయారే తొలి బాధితుడు

తెలుగు రాష్ట్రాలలో దానికి బలి అయిన తొలి రాజకీయ బాధితుడిగా ఎన్టీఆర్ ని చెప్పుకోవాలి.

By:  Tupaki Desk   |   9 Nov 2024 4:06 AM
వ్యక్తిత్వ హననం...ఎన్టీయారే తొలి బాధితుడు
X

ఒక వ్యక్తిని చంపడం కంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని చంపడం ఇంకా హేయం, దారుణం. కానీ ఇదే ఈజీగా ఉంటుంది. ఒక వ్యక్తి చుట్టూ అసత్యాలు అబద్ధాలతో కట్టుకధలు అల్లి అతన్ని కించపరచి వ్యక్తిత్వ హననానికి పాల్పడం చాలా కాలంగా జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఇది రాజకీయాల్లో ఒక పదునైన వ్యూహంగా మారిపోయింది.

ఇపుడంటే సోషల్ మీడియా ఉంది. కానీ ఇవేమీ లేని రోజులలో కూడా వ్యక్తిత్వ హననం నిరాటంకంగా సాగింది. తెలుగు రాష్ట్రాలలో దానికి బలి అయిన తొలి రాజకీయ బాధితుడిగా ఎన్టీఆర్ ని చెప్పుకోవాలి. ఆయన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు . అప్పట్లో ప్రత్యర్ధులు ఆయన మీద ఎన్ని రకాలైన అసత్య ప్రచారాలు చేశారో అంతూ పొంతూ ఉండదు, ఆయన నగ్న పూజలు చేసారని అన్నారు.

ఆయన ఏవేవో అతీంద్ర శక్తులను ఆరాధించేవారు అని కట్టు కధలు అల్లారు. ఇక ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన సందర్భంలో ఒక మేటి తెలుగు నాయకుడు అని చూడకుండా ఆయన మీద రాసిన రోత రాతలు వేసిన వ్యంగ్య కార్టూన్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా లోనే ప్రముఖంగా దర్శనం ఇచ్చాయి. ఆయన రాముడు కాదు రావణుడు అన్నారు.

ఆయన ఏమి చేసినా దానిని వేరే అర్ధాలు తీస్తూ మానసికంగా ఎన్టీఆర్ ని ఎంతలా హింసించాలో అంతలా హింసించారు. ఒక విధంగా చూస్తే ఎన్టీఆర్ మనసు ఎంతలా క్షోభ పడి ఉంటుందో అన్నది ఇపుడు అర్ధం చేసుకోవాల్సిందే. తనకే వ్యక్తిత్వం ఉందని భావించే వారు తమకు వ్యతిరేకంగా కధనాలు వస్తే తట్టుకోలేరు, తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే సహించలేరు.

కానీ ఎదుటి వారి మీద చాలా సులువుగా బురద జల్లేస్తూంటారు. ఇపుడు సోషల్ మీడియాలో వస్తున్నవి చూస్తే బాధ నిజంగా కలుగుతుంది. ఇందులో వారూ వీరూ తేడా లేకుండా అన్ని పార్తీల వారూ ఉన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అందరికీ భాగస్వామ్యం ఉంది.

ప్రభుత్వ పెద్దలు నిజంగా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అనుకుంటే రాజకీయాలకు అతీతంగా అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. అపుడే ఆరోగ్యకరమైన విమర్శలకు తావు ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను ఎవరైనా విమర్శించవచ్చు. అయితే దానికి ఒక నాగరిక భాష ఉంటుంది. దానిని మరచి హద్దూ అదుపూ లేకుండా అనుచిత భాషను వాడడం అంటే ఎక్కడికి సమాజం పోతుందో అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఈ రోజున సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చర్యలు అంటున్నారు. కానీ గత పదేళ్ళుగా ఇదే తంతు సాగుతోంది. ఈ రోజున చూస్తే అందరూ బాధితులే అని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి తర తమ భేదాలు పాటిస్తూ ఒక వైపే చూస్తే రెండవ వారు రెచ్చిపోయి తమ అనుచిత పోస్టింగులు కంటిన్యూ చేస్తారు. దానితో రెచ్చిపోయి మళ్లీ వీరూ స్టార్ట్ చేస్తారు.

అందువల్లనే ఇక్కడ చిత్తశుద్ధి అవసరం. రాజకీయాలను పక్కన పెట్టడం ఇంకా అవసరం. వీటితో పాటు రాజకీయ నేతలు కూడా తమ భాషను మార్చుకోవాలి. తోలు తీస్తా తొక్క తీస్తా మోకాళ్ళ చిప్పలు విరగ్గొట్టి కూర్చోబెడతా అనడం కూడా మంచి భాషేనా అన్నది ఆలోచించుకోవాలి.

అలాగే రాజకీయాల్లో దిగ్గజ నేతలు అనదగిన వారి నుంచి ఏమి పీకుతారు అన్న దారుణమైన భాష వస్తోంది. అంతే కాకుండా మీరు సైకో అంటే మీరు శాడిస్ట్ అన్న విమర్శలు వస్తున్నాయి. అందువల్ల ముందు రాజకీయ నేతలు పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. చట్టసభలలో కూడా అందమైన భాషను రాజ్యాంగబద్ధమైన భాషను వాడాల్సిన అవసరం ఉంది. అపుడే ఈ సోషల్ మీడియా రోత పోస్టింగులు తగ్గుతాయి.

ప్రతీ దానికీ చట్టమే పనిచేయదు. ఇంత పెద్ద వ్యవస్థలో అందరినీ బెత్తం పట్టుకుని బెదిరించడమూ కష్టమే. అందువల్ల అగ్ర శ్రేణి నేతలు పార్టీల అధినేతలు కూడా ఈ విషయంలో ఎవరికి వారుగా తమ క్యాడర్ కి లీడర్ కి ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించాలి. అలా చేస్తే కనుక మంచి భాషలోనే విమర్శలు చేసుకోవచ్చు. విషయం కూడా ప్రజలకు చేరువ అవుతుంది. కానీ అసభ్య భాషనే ఆయుధంగా చేసుకోవడానికి దానికే వ్యూహాలుగా మార్చుకోవాలని చూస్తున్న వారికీ ఇది నచ్చుతుందా అన్నదే అతి పెద్ద సందేహం.