Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఒకే ఒక్క ఆలోచన...టీడీపీ అన్న మూడు అక్షరాలు !

తెలుగు సినీ వినీలాకాశంలో అప్పటికి ఎన్టీఆర్ సూపర్ స్టార్. ఆయన సినిమాలు బ్రహ్మాండమైన కలెక్షన్లు వసూలు చేస్తున్న రోజులివి.

By:  Tupaki Desk   |   29 March 2025 5:00 AM
NTRs Vision for Telugu Desam
X

తెలుగు సినీ వినీలాకాశంలో అప్పటికి ఎన్టీఆర్ సూపర్ స్టార్. ఆయన సినిమాలు బ్రహ్మాండమైన కలెక్షన్లు వసూలు చేస్తున్న రోజులివి. అరవైలో ఇరవై అన్నట్లుగా అప్పటి యూత్ అంతా ఎన్టీఆర్ క్రేజ్ లో మోజులో పడిపోయిన సీజనది. చేతినిండా సినిమాలు, అలా కంటిన్యూ అయితే డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, మరిన్ని ఏళ్ళ పాటు సూపర్ స్టార్ డం.

కానీ ఎన్టీఆర్ మాత్రం ఇవేమీ వద్దు అనుకున్నారు ఒక మనిషికి అరవై ఏళ్ళు నిండాయి అంటే షష్టిపూర్తి జరుగుతుంది. తన మొత్తం జీవితం సింహావలోకనం చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడమే షష్టి పూర్తి ఉద్దేశ్యం. మిగిలిన కాలాన్ని సమాజానికి అంకితం చేయడమే పరమార్ధం. అందుకే ఎన్టీఆర్ తనను అప్పటికి మూడున్నర దశాబ్దాల పాటు ఆదరించిన తెలుగు జనాల రుణం తీర్చుకోవాలని అనుకున్నారు. ఆయన ఆలోచనలకు బీజం వేసిన సినిమాలు పాత్రలు ఆ సమయంలోనే వచ్చాయి.

అవే సర్దార్ పాపారాయుడు, అలాగే బొబ్బిలి పులి. ఒకటి స్వాతంత్ర్యం ముందు జరిగిన పరిణామాలు దేశం కోసం పాటు పడిన యోధుల జీవితంతో ముడిపడి ఉంటే రెండవది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మారని సగటు మనిషి జీవితం. నల్ల దొరల పాలిన పడి కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడి ఆవేదన.

ఈ సినిమాల ప్రభావంతో కూడా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న ఆయన న్యూస్ పేపర్ కూడా చూసేవారు కాదని చెబుతారు. మనకెందుకు బ్రదర్ రాజకీయాలు అని సహ నటులతో అన్న ఆయనే ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలనుకోవడం గొప్ప విడ్డూరమే.

ఇక ఆ సమయంలో అన్న గారు మద్రాస్ లో ఉండేవారు. ఆయన తెలుగుదేశం పార్టీ పేరుని కూడా తన మదిలో అనుకున్నారు. పార్టీ రంగు నుంచి చిహ్నాల నుంచి జెండా డిజైన్ నుంచి అన్నీ ఆయన మనసులో పుట్టిన ఆలోచనలే. అలా డిజైన్ చేయించారు. పసుపు ఎరుపు కలగలుపు అన్నది శుభప్రదం అని నమ్మే ఆయన తన పార్టీ గుర్తులుగా ఆ రంగులు ఎంచుకున్నారు. సామాన్యుడి వాహనం అయిన సైకిల్ ని తన పార్టీ సింబల్ గా చేసుకున్నారు.

ఇక రామారావు రాజకీయాల్లోకి రావాలనుకున్న సమయానికి కూడా ఆయనకు తెలిసిన విషయాలు పేదల కష్టాలు వాటిని ఎలాగైనా తీర్చాలన్న దృఢ సంకల్పం. అంతే తప్ప సీఎం అవాలని కానీ రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టి అక్కడే సకల భోగాలు అనుభవించాలని కానీ ఆయన మనసులో ఎన్నడూ లేదు. ఆయన సత్సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు కాబట్టే దేవుడు కూడా దీవించారు. అప్పటికి ఉమ్మడి ఏపీలో ఉన్న ఆరు కోట్ల ఆంధ్రులూ ఆశీర్వదించారు. ఇక చాలా సింపుల్ గా ఎన్టీఆర్ పార్టీని అనౌన్స్ చేశారు.

ఆయన 1982 మార్చి 29 డేట్ ని ముందే లాక్ చేసుకున్నారు మంచి ముహూర్తం చూసుకున్నారు. మద్రాస్ నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి చేరుకున్నారు. సాయంత్రం వేళ ఆయన తన పార్టీని ప్రకటించారు. అతి తక్కువ మందితో ఒక సమావేశం అనుకుంటే ఆ తరువాత ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం వార్త దావానలంగా వ్యాపించి బయట జనాలు క్షణాలలో వందల వేలలో గుమిగూడి అతి పెద్ద బహిరంగ సభగా మారిపోయింది.

ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం వార్తను తొలుత ప్రకటించింది ఆకాశవాణి. ఆరుంపావుకు వచ్చే తెలుగు వార్తలలో ప్రముఖ చలన చిత్ర నటుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారు అన్నది చాలా చిన్నగా వార్తగా వచ్చింది కానీ అది సృష్టించిన సంచలనం మాత్రం జాతీయ స్థాయిలోనే. ఆ మీదట అదే వార్తను నేషనల్ లెవెల్ లో కవర్ చేశారు.

తెల్లారేసరికి అప్పటికి ఉన్న తెలుగు పత్రికలు అన్నీ మెయిన్ హెడ్డింగ్ గా పెట్టేంత పవర్ ఫుల్ న్యూస్ అయి కూర్చుంది. ఈ రోజుకు టీడీపీ పుట్టి 43 ఏళ్ళు పూర్తి చేసుకుని 44 ఏళ్ళలోకి అడుగుపెడుతోంది. తెలుగుదేశం పెట్టిన ఆ అద్భుత ముహూర్తం వల్లనే ఇన్నేళ్ళ పాటు పార్టీ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలలలో అధికారంలోకి వచ్చింది.

అంతే కాదు ఇప్పటిదాకా పది సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటే ఆరు సార్లు గెలిచి జేగంట మోగించింది. అనేక పర్యాయాలు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించింది. ఎన్టీఆర్ చంద్రబాబు కలుపుకుని చూస్తే మొత్తం 43 ఏళ్ళ టీడీపీ కాలంలో 23 ఏళ్ళకు పైగా అధికారంలో ఉన్నట్లు అవుతుంది. బాబు నాలుగవ టెర్మ్ సీఎం గా పూర్తి చేసుకుంటే ఆయన దాదాపుగా ఇరవై ఏళ్ళ పాలన ముఖ్యమంత్రిగా పూర్తి చేసిన వారు అవుతారు. అర్ధ శతాబ్దం అంచులను చూస్తున్న టీడీపీ ఎప్పటికీ తరిగిపోని ఒక చరిత్ర. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలలో టీడీపీ ఎపుడూ టాప్ ర్యాంక్ లోనే ఉంటుంది అన్నది వాస్తవం.