తమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు... 'యుఫోరియా' పై భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు!
తలసీమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "యుఫోరియా" పేరుతో తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భారీ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 9:22 AM GMTతలసీమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "యుఫోరియా" పేరుతో తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భారీ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేదికగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎంపిక చేయగా.. ముహూర్తం ఈ నెల 15గా ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమం గురించి ఆ ట్రస్ట్ డైరెక్టర్ నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె... సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే స్ఫూర్తితో ఈ ట్రస్ట్ ను స్థాపించారని తెలిపారు. ఇక.. తలసీమియా అనేది జన్యుపరమైన రక్త హీనత అని అన్నారు.
ఇలా రక్తం తక్కువగా ఉన్న వ్యక్తులు ఎంతో బాధపడుతుంటారని.. కొన్ని సార్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారని అన్నారు. ఈ సమయలో.. అందరూ రక్తదానాన్ని ప్రోత్సహించాలని.. రక్తదానం ఎంతోమంది జీవితాలని నిలబెడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తలసీమియా సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ సెంటర్లు ప్రారంభించడానికి అవసరమైన ఫండ్ రైజింగ్ కి ఈ మ్యూజికల్ నైట్ షో ప్లాన్ చేశామని.. తమ ఆలోచనను ఒప్పుకుని డేట్స్ ఇస్తానని థమన్ ముందుకు వచ్చారని.. ఈ షో కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. ఫ్రీ గానే ఈ షో చేయడానికి ముందుకు వచ్చారని చెబుతూ.. ఈ సందర్భంగా తమన్ కు భువనేశ్వరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సమయంలో.. అందరూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని.. మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయని భువనేశ్వరి తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన తమన్... మంచి ఆలోచనతోనే మంచి విషయాలు మొదలవుతాయని.. సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన చాలా గొప్పదని అన్నారు. నాడు ఒక్క వైరస్ మనల్ని ఏ పనీ చేయనివ్వకుండా ఆపేసిందని.. చంద్రబాబుతో పాటు భువనేశ్వరి కూడా సామాజిక సృహతో పనిచేస్తున్నారని అన్నారు. ఇలాంటీ షో చేసే అవకాశం రవడం తన అదృష్టమని తమన్ అన్నారు.