ఎన్టీఆర్ కాయిన్ రూపకర్త ఎవరో తెలుసా?
అయితే ఈ నాణాన్ని రూపకల్పన చేసింది ఒక తెలుగు అమ్మయే కావడం గమనార్హం.
By: Tupaki Desk | 31 Aug 2023 1:19 PM GMTఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఇటీవల ఆయన పేరుమీద 100 రూపాయల నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది దాచుకునే నాణమే తప్ప... వాడుకునే నాణం కాదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ 100 రూపాయల నాణాన్ని సుమారు నలుగున్నర వేల రూపాయలకు అమ్ముతున్నారని తెలుస్తుంది.
ఈ సమయంలో ఈ నాణాన్ని ఎవరు డిజైన్ చేశారనే చర్చ మొదలైంది. ఈ నాణానికి రూపకర్త ఎవరు.. అనే ప్రశ్న ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ నాణాన్ని రూపకల్పన చేసింది ఒక తెలుగు అమ్మయే కావడం గమనార్హం. అవును... అనపర్తి రామవరం గ్రామానికి చెందిన నాగశైల రెడ్డి ఈ నాణాన్ని రూపొందించారు.
చిన్న వయస్సు నుండి లలిత కళలలో ఆసక్తిని కలిగి ఉన్న నాగశైల రెడ్డి... హైదరాబాద్ లోని మింట్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యుత్తమ నాణాలను డిజైన్ చేసేవారిలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో... మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ హోల్డర్ అయిన నాగశైల రెడ్డి గురించిన సెర్చ్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది!
మరోవైపు... నందమూరి తారక రామారావు రూ. 100 స్మారక నాణెం అమ్మకాలు ఆన్ లైన్ లోనూ, అటు హైదరాబాద్ లోనూ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ తో పాటు చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియంలలో ఈ నాణాలు అందుబాటులో ఉన్నాయి.
కాగా... ఈ నాణెం కోసం నాలుగు ధాతువులు (50% వెండి, 40% రాగి, 5% జింక్, 5% నికెల్) కలిపి తయారైన క్వాడ్రినరీ అల్లాయ్ తో రూపొందించామని మింట్ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా 12,000 నాణేలను ముద్రించారు.