రెండు పార్టీల నేతలకూ "గాడ్ ఫాదర్"... ఏపీ పాలిటిక్స్ లో జూ. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్!
ఆ సంగతి అలా ఉంటే... తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నట్లుగానే జూనియర్ సినిమాల్లో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 April 2024 4:17 AM GMTఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటుందనేది తెలిసిన విషయమే! ప్రధానంగా టీడీపీ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను ఆయన అభిమానులు ప్రదర్శిస్తుండటం.. చంద్రబాబు వారిపై అసహనం వ్యక్తం చేయడం రొటీన్ గా జరిగేదే! ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాలో అటువంటి ఘటనలు చాలానే తెరపైకి వచ్చాయి! ఇక, లోకేష్ ఫ్యాన్స్ కూడా భీమవరంలో ఇటీవల అదేపనికి పూనుకున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నట్లుగానే జూనియర్ సినిమాల్లో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన మరో రెండు దశాబ్ధాల వరకూ ఇటు వైపు చూసే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలనుకోవడమే ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యం, లక్ష్యం అని నొక్కి చెబుతున్నారు.
ఈ క్రమంలో... ఓ టీడీపీ నేత, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడమే కాకుండా... ఆయన ఫోటోపై "రాబోయే కాలానికి కాబోయే సీఎం" అని రాసి ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ వైరల్ అయ్యింది. ఒక పక్క టీడీపీ కార్యక్రమాల్లో జూనియర్ ఎంట్రీని ఆ పార్టీ అధినేత & కో స్వాగతించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... టీడీపీ నేత టీజీ భరత్ ఇలా "కాబోయే సీఎం" అంటూ ప్రదర్శించడం వైరల్ గా మారింది. అయితే... మిగిలిన టీడీపీ నేతలెవరూ ఈ సాహసం చేయలేదని అంటున్నారు.
మరోపక్క వైసీపీ ఎమ్మెల్యే, జూనియర్ కి అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషిగా పేరున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్ పిక్స్ తో హల్ చల్ చేశారు. ఆయన నామినేషన్ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోల్లో సీనియర్ ఎన్టీఆర్ - జూనియర్ ఎన్టీఆర్.. మధ్యలో వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు.
ఇదే సమయంలో మరికొన్ని ఫోటోల్లో సీనియర్ ఎన్టీఆర్ - కొడాలి నాని ఫోటోల మధ్య జగన్ ఫోటోను పెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను పెద్దగా ప్రదర్శించారు. దీంతో... గురువారం నాడు గుడివాడ మొత్తం ఎన్టీఆర్ ఫోటోల ప్రదర్శన, ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోయింది. దీంతో మరోసారి ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో... చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమాలోని ఒక డైలాగ్ ని గుర్తుచేస్తున్నారు అభిమానులు. ఇందులో భాగంగా... "నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు" అనే డైలాగ్ జూనియర్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని చెబుతున్నారు!