Begin typing your search above and press return to search.

సౌత్‌పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. కేరళకు గుడ్‌న్యూస్

ఇందులో భాగంగానే దక్షిణ భారతానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది.

By:  Tupaki Desk   |   25 Dec 2024 12:30 PM GMT
సౌత్‌పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. కేరళకు గుడ్‌న్యూస్
X

వచ్చే ఎన్నికల్లో సౌత్‌ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ. ఎలా అయినా సౌత్‌లో పాగా వేయాలని బీజేపీ ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే దక్షిణ భారతానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది.

దక్షిణ భారతంలోని కేరళలో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్రం ముందుకు సాగుతోంది. అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కె.కృష్ణకుట్టి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ చర్చల సందర్భంగా కేరళలో అణుశక్తి కేంద్రాన్ని నిర్మించాలని సూచించినట్లు సమాచారం. కేరళలో థోరియం నిక్షేపాలు కోకొల్లలు. వాటిని వినియోగించి దాని నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కేరళకు ఇవ్వాలని సమావేశంలో చర్చ నడిచింది. అణు విద్యుత్‌ను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూర్చాలని ఖట్టర్ సూచించినట్లు సమాచారం.

కేరళలో ఇటీవల ఇంధన డిమాండ్ 4,260 మెగావాట్లు కాగా.. 2030 నాటికి అది 10వేల మెగావాట్లకు చేరుతుందని ఆ స్టేట్ అంచనా వేస్తోంది. అయితే.. విద్యుత్ లోటును ఎదుర్కొంటున్న కేరళ ఇప్పటికే పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోంది. దీని నుంచి బయటపడేందుకు రాష్ట్రంలోని ఖనిజ నిక్షేపాలను వినియోగించి న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

కేరళలో మరిన్ని మౌలిక సదుపాయాలు విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని కేంద్రం కోరింది. నిధుల కోసం రాష్ట్రంలోని థోరియం నిక్షేపాలను కేంద్రం వాడుకోవాలని రాష్ట్రం సూచించింది. కాగా.. ఈ సమావేశం తరువాత కేంద్ర మంత్రి ఖట్టర్ మాట్లాడారు. కేరళ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే.. ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్రం నిర్ణయంతో కేరళ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అయింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే.. రాష్ట్రం విద్యుత్ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం పెద్దలు కూడా చెబుతున్నారు.