సముద్రంలో చైనాకు గట్టి ఎదురుదెబ్బ!
సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం ఇరుగు పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది
By: Tupaki Desk | 4 Oct 2023 8:31 AM GMTసముద్ర జలాలపై ఆధిపత్యం కోసం ఇరుగు పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు సమీపంలోని పసుపు సముద్రం (ఎల్లో సీ) జలాల్లో చైనా జలాంతర్గామి ఘోర ప్రమాదంలో చిక్కుకుంది. ఫలితంగా అందులో ఉన్న 55 మంది మరణించారని వార్తలు వచ్చాయి. సముద్రంలో ఉన్న ఉచ్చులో సబ్ మెరైన్ చిక్కుకుపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఉచ్చు శత్రు దేశాల నౌకలు రాకుండా అడ్డుకోవడానికి చైనా వేసిందేనని చెబుతున్నారు. దీంతో తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు చైనా పరిస్థితి అయ్యింది.
అయితే ఈ ప్రమాదం ఇప్పుడు జరిగింది కాదు.. ఆగస్టు 21నే జరగ్గా ఇప్పుడు తాజాగా వెలుగు చూసింది. ఈ విషయంపై చైనా మాత్రం ఎప్పటిలానే బయటకు తెలియనీయకుండా గుంభనంగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని బ్రిటీష్ మీడియా బయటపెట్టడంతో ఈ ఘటన వెలుగుచూసింది. మరోవైపు అణు లీకేజీలు కూడా సబ్ మెరైన్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తుండటం గమనార్హం.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన అణుశక్తి సబ్ మెరైన్ '093-417' ఆగస్టు 21న ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 55 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగి 40 రోజులు దాటినా చైనా ఈ ప్రమాదం గురించి వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా 'డైలీ మెయిల్' సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్ మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని ఖండించాయని తేలింది. కానీ, తాజాగా బ్రిటన్ సబ్ మెరైనర్లు కూడా ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించడం విశేషం.
చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ సమీపంలోని ఎల్లో సముద్రంలో ఆగస్టు 21వ తేదీ ఉదయం 8.21 సమయంలో చైనా అణుశక్తి సబ్ మెరైన్ '093–417' సముద్రంలో ఇరుక్కుపోయింది. సబ్ మెరైన్ 350 అడుగులకు పైగా పొడవు ఉంటుంది. సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆ జలాంతర్గామిలో బ్యాటరీల శక్తి అయిపోయింది. ఫలితంగా అందులో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చారు. కానీ, అదికూడా విఫలమై గాలి కలుషితమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని బ్రిటిష్ నిపుణులు చెబుతున్నారు.
సబ్ మెరైన్ కు మరమ్మతులు చేయడానికి అందులో ఉన్న ఇంజనీర్లు, సిబ్బందికి దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. అయితే అంతదాకా సరైన ఆక్సిజన్ అందక 55 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ క్యాడెట్లు, తొమ్మిది మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది నావికులు ఉన్నారని చెబుతున్నారు. అలాగే సబ్ మెరైన్ కెప్టెన్ కూడా ఉన్నట్టు పేర్కొంటున్నారు.
ఈ సబ్ మెరైన్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో క్వింగ్ డావ్ నౌకాదళ స్థావరం ఉంది. దీని సమీపంలోకి అమెరికా, బ్రిటన్ ల జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో చైనా ఉచ్చును ఏర్పాటు చేసింది. బీజింగ్ నౌకాదళం ఇలాంటి ఉచ్చులను సముద్ర జలాల్లో వేస్తోంది.
సబ్ మెరైన్ ప్రమాదం జరిగిన వెంటనే పశ్చిమ దేశాలకు చెందిన పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే అప్పట్లో చైనా, తైవాన్ అధికారులు ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని తోసిపుచ్చారు. అమెరికాకు చెందిన నౌకాదళ నిపుణుడు హెచ్‌ఐ సట్టన్ ఆగస్టు 22న చైనా నౌకాదళంలో అణుశక్తి సబ్ మెరైన్ ప్రమాదానికి గురైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సబ్ మెరైన్ నుంచి ఆ సమయంలో ఎన్ క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్స్ కూడా పొరుగు దేశాలకు వెళ్లినట్టు సమాచారం.
మరోవైపు సబ్ మెరైన్ ప్రమాద సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నారు. ప్రమాద ఘటన సమాచారం ఆయనకు తెలియడంతోనే ఆయన ప్రసంగం నుంచి హఠాత్తుగా వైదొలిగారని చెబుతున్నారు.