Begin typing your search above and press return to search.

మరో 48 గంటల్లో సముద్రంలోకి అణు జలాలు... కౌంట్ డౌన్ స్టార్ట్!

అణు రియాక్టర్‌ లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:17 AM GMT
మరో 48 గంటల్లో  సముద్రంలోకి అణు జలాలు... కౌంట్  డౌన్  స్టార్ట్!
X

సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుండి పేరుకుపోయిన వ్యర్థ జలాలను మరో 48 గంటల్లో సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టనుంది జపాన్. తాజాగా ఈ విషయాలను జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా వెల్లడించారు. దీంతో ఈ విషయంపై సరిహద్దు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అవును... అణు రియాక్టర్‌ లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్ ప్రకటించింది. అయితే... జపాన్‌ నిర్ణయాన్ని చుట్టుపక్కల దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి పర్యవేక్షక సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి మిషన్ (ఐఏఈఏ) మాత్రం ఇప్పటికే ఈ ప్లాన్‌ కు అనుమతి మంజూరు చేసింది.

దీంతో జపాన్‌ వద్ద శుద్ధి చేసినట్లుగా చెబుతున్న 1.34 మిలియన్‌ టన్నుల అణు జలాలు సముద్రంలోకి విడుదల కాబోతున్నాయని అంటున్నారు. ఇవి 500 ఒలింపిక్‌ సైజు స్విమ్మింగ్‌ పూల్స్‌ కు సమానం అని చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఫసిఫిక్ మహా సముద్రాన్ని జపాన్‌ తన వ్యక్తిగత మురుగుకాల్వగా భావిస్తోందని బీజింగ్‌ తీవ్రంగా విమర్శించింది. ఇదే క్రమంలో దక్షిణ కొరియాలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఫుకుషిమా అణుకేంద్రం సమీపంలోని జలాల నుంచి పట్టిన చేపల దిగుమతిపై ఈ రెండు దేశాలు నిషేధం విధించాయి.

ఇదే సమయంలో "ఫుకుషిమా కలుషితమైన నీటిని పారవేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము".. "ఏ రేడియోధార్మిక పదార్థమూ సముద్రానికి సురక్షితం కాదు" అని రాసి ఉన్న బోర్డులను పట్టుకుని, ప్రదర్శనకారులు దక్షిణ కొరియా వీదుల్లో కవాతు చేస్తున్నారు.

కాగా... 2011 సునామీలో రియాక్టర్‌ దెబ్బతిన్న నాటి నుంచి జపాన్‌ ఈ అణుజలాలను నిల్వచేసి ఉంచింది. అయితే ఇప్పుడు చోటు సరిపోని పరిస్థితికి చేరుకోవడంతో వీటిని వివిధ దశల్లో శుద్ధి చేసి రానున్న 30 ఏళ్లపాటు నీటిలోకి విడుదల చేయనున్నట్లు తెలిస్తోంది. ఈ సమయంలో ఆగస్టు 24 నుంచి నీటి విడుదలకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఇప్పటికే అధికారులు ప్లాంట్‌ నిర్వాహకులను కోరారు.

ఈ విషయాలపై జపాన్ తనవంతు క్లారిటీ ఇస్తోంది. నీటి విడుదల చేయక తప్పని పరిస్థితి అని చెబుతోంది. ఈ ప్లాంట్‌ ను మూసివేయాలంటే నీటి విడుదల చేయాల్సిందేనని నొక్కి వక్కానిస్తోంది. ఇదే సమయంలో... టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) ఈ నీటిని వడగట్టి 60 రకాల రేడియో యాక్టివ్‌ పదార్థాలను తొలిగిస్తున్నట్లు చెబుతుంది!