గాయమైతే కుట్లు వేయకుండా ఫెవీక్విక్ తో చికిత్స చేసిన నర్సు
సాధారణంగా ఏదైనా వస్తువు విరిగిపోతే ఏం చేస్తాం? ఫెవీక్విక్ తో అతికించే ప్రయత్నం చేస్తాం.
By: Tupaki Desk | 6 Feb 2025 6:37 AM GMTసాధారణంగా ఏదైనా వస్తువు విరిగిపోతే ఏం చేస్తాం? ఫెవీక్విక్ తో అతికించే ప్రయత్నం చేస్తాం. మరి.. అలాంటి ఫెవీ క్విక్ ను శరీర భాగాలకు గాయాలైతే.. దాన్ని ఉపయోగించి వైద్యం చేస్తామంటే? ఉలిక్కిపడటమే కాదు.. ఈ తరహా వైద్యం చేసే వారికి దూరంగా పారిపోతాం. కానీ.. ఒక నర్సు మహాతల్లి మాత్రం తాను ఫెవీ క్విక్ తో వైద్యం చేస్తానని చెప్పటమే కాదు.. అలానే కొన్నేళ్లుగా చేస్తున్నానని.. తనను నమ్మాలని చెప్పిన షాకింగ్ ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది.
రాష్ట్రానికి చెందిన హవేరీ జిల్లాకు చెందిన జ్యోతి ప్రభుత్వ ప్రాథమిక చికిత్స కేంద్రంలో నర్సుగా సేవలు అందిస్తున్నారు. నెల క్రితం పద్నాలుగేళ్ల చిన్నారి చెంపకు తీవ్ర గాయమైతే.. ఆమె తల్లిదండ్రులు స్థానిక అడూర్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకొచ్చారు. చికిత్సలో భాగంగా గాయానికి కుట్లు వేయకుండా.. ఫెవీ క్విక్ వాడుతుండటం చూసిన పాప తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కుట్లు వేస్తే ముఖానికి మరక పడుతుందని.. అదే ఫెవీ క్విక్ వాడితే చర్మంలో కలిసి పోతుందని చెప్పటంతో వారు అవాక్కు అయ్యారు. అలా వద్దని చెప్పగా.. తాను కొంతకాలంగా అలానే చేశానని.. మంచి ఫలితాలు వచ్చినట్లుగా చెప్పటం గమనార్హం. దీంతో.. నర్సు జ్యోతి చేస్తున్న పనికి హడలిపోయిన వారు ఆమె చేసే పనిని వీడియో తీసి అధికారులకు కంప్లైంట్ చేశారు. ఈ వైనం షాకింగ్ గా మారింది. దీంతో ఆమెను వేరే ప్రాంతానికి బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. ఆమె వైద్యం గురించి తెలిసిన వారంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయటం.. ఇదేం తీరు? అంటూ విమర్శలు కురిపించటంతో వైద్య అధికారులతో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సమావేశమయ్యారు. సదరు నర్సును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫెవీక్విక్ లాంటి వాటితో వైద్యం చేయకూడదని.. హెల్త్.. ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ కమిషన్ కార్యాలయం తాజాగా ఒక నోట విడుదల చేసింది. ఈ ఉదంతంలో స్టాఫ్ నర్సుదే పూర్తి బాధ్యతని.. ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా పేర్కొంటూ.. ఈ వైనంపై విచారణకు ఆదేశించారు.