పాతికేళ్ల 'సీఎం' రికార్డుకు బ్రేక్
అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో పాతికేళ్ల నవీన్ పట్నాయక్ రికార్డుకు ఒడిశా ప్రజలు బ్రేక్ వేశారు.
By: Tupaki Desk | 4 Jun 2024 12:03 PM GMTఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి ప్రత్యేకంగా దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేదు. దాదాపు పాతికేళ్లుగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ వన్ మ్యాన్ షో కొనసాగుతోంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్(బీజేడీ)పార్టీని ప్రజలు వరుసగా ఐదు సార్లు గెలిపించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ రికార్డు కూడా సృష్టించారు. 24 సంవత్సరాలుగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో పాతికేళ్ల నవీన్ పట్నాయక్ రికార్డుకు ఒడిశా ప్రజలు బ్రేక్ వేశారు.
బీజేపీకి పట్టం కడుతూ అక్కడ ప్రజలు బీజేడీని ఓటమి పాలు చేసేదిశగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ఒడిసా అసెంబ్లీలోని 147 స్థానాలకు ఎన్నికలు జరగక అనూహ్యంగా బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టే దిశగా దూసుకుపోతోంది. బీజేడీ దాదాపుగా ఓటమి అంచున నిలబడింది. ఒడిశా అసెంబ్లీలో అధికారాన్ని చేపట్టేందుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 74 కాగా బీజేపీ 81 పై చిలుకు స్థానాలలో మెజార్టీలో కొనసాగుతోంది. అధికార బీజేడీ మాత్రం 47 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. దీంతో బీజేడీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. నవీన్ పట్నాయక్ రెండు స్థానాల్లో పోటీ చేయగా ఒకదానిలో ఓడిపోయారు. మొత్తం 21 ఎంపీ స్థానాలు ఉన్న ఒడిశాలో 18 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మరో రెండు చోట్ల బీజేడీ, ఒకచోట కాంగ్రెస్ గెలుపొందాయి.
అయితే, నవీన్ పట్నాయక్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. 24 ఏళ్లుగా పాలన సాగిస్తున్న నవీన్ పట్నాయక్ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకోవడంలో విఫలం కాగా బీజేపీ దానిని అందిపుచ్చుకుంది. ఇక దానికి తోడు నవీన్ పట్నాయక్ అనారోగ్యం కూడా ఆయన ఓటమికి కారణమైంది. మాజీ ఐఏఎస్ పాండ్యన్ కు గత రెండేళ్లుగా అధికారాన్ని నవీన్ పట్నాయక్ అప్పగించి యాక్టింగ్ సీఎంగా ఉన్నరు అన్న ఆరోపణలున్నాయి. పాతికేళ్లుగా నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్నా ప్రజల జీవితాల్లో మార్పులు ఏమీ రాలేదు అన్న ప్రచారాన్ని బీజేపీ గట్టిగా చేయడంలో సఫలమైంది. ఇక పూరి జగన్నాథ్ ఆలయ తాళాల వ్యవహారం కూడా నవీన్ పట్నాయక్ ఓటమికి మరో కారణం. ఏదేమైనా ముందుగా చెప్పినట్లుగానే ఒడిశాలో బీజేపీ అధికారం చేపట్టబోతోంది.