ఆప్తులు రాక అనాధలైన మృతదేహాలు!
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం జరిగి సరిగ్గా నేటికి రెండు నెలలు పూర్తవుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 2 Aug 2023 5:56 AM GMTఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం జరిగి సరిగ్గా నేటికి రెండు నెలలు పూర్తవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాధంలో సుమారు 291 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో ఇప్పటికీ 29మృతదేహాలను మాత్రం ఎవరూ గుర్తించలేదు. ఇప్పటికే ఆ మృతదేహాలకు విముక్తి కలగడం లేదు!
అవును... జూన్ 2న బాలాసోర్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దాని బోగీలు మెయిన్ లైన్ పై పడగా.. వాటిని హౌరా వెళ్తున్న షాలిమార్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 291 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.
అనంతరం ఆ మృతదేహాలను భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు తరలించారు. ఈ సమయంలో మృతదేహాలకు డి.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి బందువులకు అప్పగిస్తున్నారు అధికారులు. ఈ సమయంలో సుమారు 29 మృతదేహాలు అనాధలుగా మిగిలిపోయాయని అధికారులు చెబుతున్నారు.
అవును... 291 మందిలో ఇంకా 29 మృతదేహాలు ఎవరివి అనేది ఇంకా గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు. ఇలా గుర్తించని మృతదేహాలను కంటైనర్ లో భద్రపరిచినట్లు ఆస్పత్రి సూపరిండెంట్ చెబుతున్నారు. డి.ఎన్.ఏ. నమూనాలతో సరిపోలిన తర్వాతే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు ఎయిమ్స్ భువనేశ్వర్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ పరిదా వివరాలు వెల్లడించారు. జూన్ 2న జరిగిన ఈ ప్రమాదం తర్వాత.. వివిధ ఆసుపత్రులు, ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మొత్తం 162 మృతదేహాలను స్వీకరించామని తెలిపారు. వాటిలో 81 మందిని వారి కుటుంబ సభ్యులకు అందించామని చెప్పారు.
ఇదే సమయంలో తీవ్రమైన గాయాలు, ఇతర సమస్యలు ఉన్నందున మిగిలిన 81 మృతదేహాలను మొదట గుర్తించలేమని పరిదా చెప్పారు. ఈ నేపథ్యంలో డి.ఎన్.ఏ. పరీక్ష ఫలితాల ఆధారంగా మరో 52 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు. ఇక మిగిలిన 29మంది మృతదేహాలు ఇప్పటికీ గుర్తించలేదని వెల్లడించారు.