బందరు బియ్యం మాయం వెనుక అధికారులు?
దీంతో మాజీ మంత్రి పేర్నితో కొందరు కుమ్మక్కై రేషన్ బియ్యం మాయాం చేశారా? అని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు.
By: Tupaki Desk | 24 Dec 2024 1:30 PM GMTరాష్ట్రంలో సంచలనం కలిగించిన మచిలీపట్నంలోని రేషన్ బియ్యం కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు సహకారం లేకపోవడంతో కేసు దర్యాప్తు ఆలస్యమవుతోందని పోలీసులు చెబుతున్నారు. దీంతో మాజీ మంత్రి పేర్నితో కొందరు కుమ్మక్కై రేషన్ బియ్యం మాయాం చేశారా? అని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు.
పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారుల సహకారంతోనే బియ్యం బయటకు వెళ్లాయని పోలీసులు సందేహిస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు అధికారులు, ఉద్యోగులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ తప్పించుకోవాలని చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు గొడౌన్లల్ ఉన్న రేషన్ బియ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సివుంటుంది. ప్రతి నెలా సరకు నిల్వబ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.
డిసెంబర్ 4న జేసీ గీతాంజలి శర్మ తనిఖీ చేసేందుకు ముందు 11 నెలలుపాటు ఏ అధికారి కానీ, ఉద్యోగి కానీ పేర్ని జయసుధకు చెందిన గిడ్డంగులను తనిఖీ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలల ముందు వరకు వైసీపీ ప్రభుత్వ హయంలో పేర్ని పలుకుబడి వల్ల గొడౌన్లను తనిఖీ చేయలేకపోయారనుకుంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనిఖీలు చేయకపోవడం పరిశీలిస్తే బియ్యం మాయం వెనుక అధికారుల పాత్ర కూడా ఉందని తెలుస్తోందని పోలీసు వర్గాల సమాచారం.
పేదల బియ్యం నిల్వచేసిన గొడౌన్లను 11 నెలల పాటు తనిఖీ చేయకుండా వదిలేయడమేంటని ప్రభుత్వపెద్దలు నిలదీస్తున్నారు. ఈ నెలతో గొడౌన్ లీజు కాలం పూర్తవుతుంది. లీజు పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో అసలు విషయం బయటపడింది. గొడౌన్ ఖాళీ చేసే పరిస్థితి వస్తే మాయమైన బియ్యం లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఆలోచనతో కొంతమంది అధికారులు రంగంలోకి దిగి తేడా వచ్చిన బియ్యానికి డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా సూచించినట్లు చెబుతున్నారు.
వాస్తవానికి గొడౌన్ యజమాని పేర్ని జయసుధ లేఖ ద్వారా చెప్పినంత వరకు బియ్యం తరలిపోయాయనే విషయం ఎవరికీ తెలియదు. గొడౌన్లను ఖాళీ చేస్తే పూర్తిస్థాయిలో బియ్యం లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఆలోచనతో బియ్యం తరుగుదల వచ్చిందని, వే బ్రిడ్జి సాంకేతిక సమస్య కారణంగా లెక్కలు తేడా వచ్చాయని, బియ్యం సంచులు కన్నాల వల్ల కారిపోయాయని చెప్పుకొచ్చారు. అయితే తేడా వేల టన్నుల్లో ఉండటంతో డబ్బు చెల్లించి తప్పించుకోవాలని చూశారు. కానీ, ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా లేకపోవడంతో మాజీ మంత్రి పేర్ని కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూపీ లాగితే అధికారుల పాత్ర బయటపడుతోందంటున్నారు.