మణికొండ చిత్రపురి కాలనీకి బిగ్ షాక్... అసలు ఏమిటి సమస్య?
ప్రస్తుతం ప్రధానంగా హైదరాబాద్ లో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Aug 2024 10:10 AM GMTప్రస్తుతం ప్రధానంగా హైదరాబాద్ లో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ కూల్చివేత కార్యక్రమం చేపట్టిన అనంతరం హైడ్రా అనేది తెలంగాణ మొత్తం మీద హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మణికొండ చిత్రపురి కాలనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. అధికారులు ఇక్కడ ఇళ్లకు నోటీసులు ఇచ్చారు.
అవును... ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీంతో... అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో హైడ్రా సరికొత్త రైళ్లు పరుగెత్తిస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మించిన విల్లాల అనుమతుల అంశం తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... మణికొండ చిత్రపురి కాలనీలోని నిర్మాణాలకు అనుమతులు లేవంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు కాలనీలోని 225 విల్లాలకు మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు అందజేశారు. గత సొసైటీ పాలకవర్గం.. దొంగచాటుగా ఈ నిర్మాణాలకు అనుమతులు పొందిందని మున్సిపల్ అధికారులు తేల్చారని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన అధికారులు జీవో 658కు విరుద్ధంగా 225 ఆర్.వో.డబ్ల్యూ హౌస్ ల నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించినట్లు తెలిపారు! సదరు బిల్డర్లు కేవలం జీ+1 కు అనుమతులు తీసుకుని.. అక్రమంగా జీ+2 నిర్మాణాలు చేపట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని అంటున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా ఇచ్చిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ సూచించారు. గత పాలకవర్గం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు రూ.50 కోట్ల మెర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయని తెలుస్తోంది.