అమరావతిలో వైసీపీ 'పంట' పండుతోంది.. ఏం చేస్తున్నారంటే!
ఒక్కపనిని చేపట్టకపోగా మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానిని అటకెక్కించే ప్రయత్నం చేసింది.
By: Tupaki Desk | 13 Jan 2025 11:30 AM GMTనవ్యాంధ్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నానా ప్రయాసలు పడుతోంది. అప్పులు తెచ్చి.. నిధులు కేటాయించి.. కేంద్రాన్నికోరి.. ఇలా వివిధ రూపాల్లో అమరావతిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకుంది. అయితే.. గత ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం రాజధానిని పడకేసింది. ఒక్కపనిని చేపట్టకపోగా మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానిని అటకెక్కించే ప్రయత్నం చేసింది.
అనేక న్యాయపోరాటాల ఫలితంగా రాజధాని ఆగింది. కూటమి రాకతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అయితే.. ఇప్పుడు ఇదే అమరావతిపై వైసీపీ నాయకులు మరో రూపంలో దాడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను కొందరు వైసీపీ సానుభూతిపరులు.. సాగు చేస్తు న్నారు. వీరికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అండ ఉందని సమాచారం. దీంతో కీలకమైన రాజధాని ప్రాంతీయ అభివృద్ధి స్థలం(సీఆర్‌డీఏ)లో పంటల కోసం భూములు దున్నుతున్నారు.
మరికొందరు ఇక్కడ పంటలు కూడా సాగు చేస్తున్నారు. అయితే.. ఈ విషయాలు ఇంకా ప్రభుత్వం దృష్టికి రాలేదని.. అధికారులకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని.. పెద్ద ఎత్తున రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆరోపిస్తున్నారు. దీంతోవారి పంట పండుతోందని స్థానికులు చెబుతున్నారు. సుమారు 18 నుంచి 20 ఎకరాల స్థలంలో పంటలు వేశారని తెలిపారు. కొందరు పశుగ్రాసం పండిస్తే.. మరికొందరు వరి, మొక్కజొన్న పంటలు వేసినట్టు స్థానిక రైతులు చెబుతున్నారు.
సెంటిమెంటు అడ్డు పెట్టి..
రైతులు ఇలా పంటలు వేయడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. అలాగని చర్యలు తీసుకునేందు కు వెనుకాడుతున్నారు. దీనికి కారణం రైతు అనే సెంటిమెంటు అడ్డు వస్తోందన్న టాక్ వినిపిస్తోంది. తాము జోక్యం చేసుకుని పంటలను దున్నేస్తే.. రైతుల పక్షాన వైసీపీ ఆందోళనలకు దిగి.. యాగీ చేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇది ప్రభుత్వానికి కూడామచ్చ తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు సదరు పంటలు కోతకు వచ్చి.. పూర్తయ్యే వరకు ఏమీ చేయలేమని చెప్పడం గమనార్హం. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.