Begin typing your search above and press return to search.

చమురు సంస్థలకు లాభాల పంట... దీపావళికి గుడ్ న్యూస్?

ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు మాత్రం లీటర్ పై రూ.2 చొప్పున తగ్గించాయి చమురు కంపెనీలు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 12:30 AM GMT
చమురు సంస్థలకు లాభాల పంట... దీపావళికి  గుడ్  న్యూస్?
X

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా గరిష్ట స్థాయిల్లో వీటి ధరలు ఉన్న పరిస్థితి. లీటర్ పై పెట్రోల్ కోసం రూ.100కి పైనే చెల్లించాల్సి వస్తుండగా.. డీజిల్ పైనా దాదాపు అంతే చెల్లిస్తున్నారు! ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు మాత్రం లీటర్ పై రూ.2 చొప్పున తగ్గించాయి చమురు కంపెనీలు.

మరోపక్క అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ.. దేశీయంగా మాత్రం ధరలు తగ్గించేందుకు కేంద్రం, చమురు కంపెనీలు ప్రయత్నించడం లేదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రజలు ఆశపడుతుండటమే తప్ప.. ప్రభుత్వం నుంచి అలాంటి చర్యలు తీసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా అంతర్జాతీయంగా చమురు రేట్లు పడిపోతున్న క్రమంలో... దేశీయంగా చమురు సంస్థల మార్జిన్లు బాగా పెరిగాయని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రేటింగ్ ఏజెన్సీల్లో ఒకటైన ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఇక్రా) కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. దీంతో... త్వరలో లీటరుపై రూ.2 నుంచి రూ.3 వరకూ తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది.

అవును... భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ సగటు ధర సెప్టెంబరులో బ్యారెల్ 74 డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి నెలలో ఇది 83 నుంచి 84 డాలర్లుగా ఉండేది. దీంతో... ప్రభుత్వ రంగ చమురు సంస్థల మార్జిన్లు మెరుగయ్యాయని.. ఫలితంగా దీపావళి నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పైగా కొన్ని రోజుల క్రితం దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురు ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రం విండ్ ఫాల్ టాక్స్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో... రానున్న రోజుల్లో ఫ్యుయెల్ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.