Begin typing your search above and press return to search.

జనాల మీద బాదుడు.. పెట్రో కంపెనీలకు భారీ లాభాలు!

తాజాగా విడుదల చేసిన ఫలితాల్ని చూసినప్పుడు దేశీయంగా ఉన్న ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలు భారీగా లాభాల్ని నమోదు చేశాయి.

By:  Tupaki Desk   |   13 May 2024 5:50 AM GMT
జనాల మీద బాదుడు.. పెట్రో కంపెనీలకు భారీ లాభాలు!
X

ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2023-24) లో దేశీయ ఆయిల్ (ఇంధన) కంపెనీలు లాభాల పంట పండించాయి.తాజాగా విడుదల చేసిన ఫలితాల్ని చూసినప్పుడు దేశీయంగా ఉన్న ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలు భారీగా లాభాల్ని నమోదు చేశాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గత ఏడాది పలు సంక్షోభాలు ఎదురైనప్పటికీ లాభాలు పంట పండటం ఆసక్తికరమని చెప్పాలి.

ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ).. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్).. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్ పీసీఎల్) లు ఏడాది వ్యవధిలో రూ.81వేల కోట్ల భారీ లాభాల్ని ఆర్జించాయి. గత ఏడాది చమురు సంక్షోభం ఎదురైంది. అయినప్పటికీ అంతకు ముందున్న సంవత్సరాల్లో నమోదు చేసిన లాభాల్ని దాటేయటం ఆసక్తికరంగా మారింది.

చమురు సంక్షోభానికి ముందు ఈ మూడు సంస్థల లాభాలు కేవలం రూ. రూ.39,356 కోట్లు కాగా..అందుకు భిన్నంగా గత ఏడాది రూ.81వేల కోట్ల లాభాల్ని నమోదు చేశాయి. ప్రభుత్వ రంగానికి చెందిన మూడు ప్రభుత్వ రంగ సంస్థలు పోటాపోటీగా లాభాల్ని ఆర్జించాయి. బీపీసీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.26,673 కోట్లు కాగా 2022 - 23 లో కేవలం రూ.1870 కోట్లు మాత్రమే. హెచచ్ పీసీఎల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.14,693 కోట్లు కాగా.. అంతకు ముందు ఏడాది (2022-23)లో రూ.6382 కోట్లు మాత్రమే. ఇక.. ఐవోసీ విషయానికి వస్తే గత ఏడాది రూ.39,618 కోట్ల లాభాన్ని నమోదు చేస్తే.. అంతకు ముందున్న ఏడాది ఈ లాభాలు కేవలం రూ.8214 మాత్రమే.

దేశీయ ఇంధన మార్కెట్ లో ఈ మూడు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలకు 90 శాతం వాటా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ పీజీ సబ్సిడీతో ఐవోసీ.. బీపీసీఎల్ లు లాభాల్ని నమోదు చేశాయి. హెచ్ పీసీఎల్ మాత్రం నష్టాల్ని ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సగానికి తగ్గి బ్యారెల్ 72 డాలర్లకు పరిమితం కావటం కూడా భారీ లాభాలకు అవకాశంగా మారిందంటున్నారు.

నాలుగో క్వార్టర్ లో బ్యారెల్ ముడి చమురు 90 డాలర్లు చేరుకున్న కారణంగా కొంతమేర లాభాలు తగ్గాయని.. లేదంటే రూ.లక్ష కోట్ల మార్కును దాటేసి ఉండేవారిన చెబుతున్నారు. ఆయిల్ సంస్థలు లాభాల జోరులో ఉంటే.. జనాలు మాత్రం ముక్కుతూ ములుగుతూ పెరిగిన ధరలు చెల్లిస్తూ ఉండాల్సిన దుస్థితి.