Begin typing your search above and press return to search.

గూగుల్ మ్యాప్ కు గుడ్ బై... నిర్ణయం వెనుక ఓలా అసలు ఉద్దేశ్యం ఇదే!?

ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్ అనేది మనిషి ప్రయాణంలో ఒక కీలక భాగమైపోయింది.

By:  Tupaki Desk   |   10 July 2024 2:30 PM GMT
గూగుల్  మ్యాప్  కు  గుడ్  బై... నిర్ణయం వెనుక ఓలా అసలు ఉద్దేశ్యం ఇదే!?
X

ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్ అనేది మనిషి ప్రయాణంలో ఒక కీలక భాగమైపోయింది. తెలియని ప్రాంతానికే కాదు.. తెలిసిన ప్రాంతానికి సైతం ట్రాఫిక్ సమస్యలు గుర్తించడానికీ గూగుల్ మ్యాప్ పైనే ఆధారపడిపోతున్నారు. ముందుగా అడ్రస్ కనిపెట్టడం.. అక్కడనికి సులువగా వెళ్లగలిగే మార్పులను కనిపెట్టి తీసుకెళ్లడంలో గూగుల్ మ్యాప్ సక్సెస్ అయ్యింది! అయితే... అలాంటి గూగుల్ మ్యాప్ కి గుడ్ బై చెప్పింది ఓలా!

అవును... గూగుల్ మ్యాప్ లేకుండా వీధి చివరకు కూడా వెళ్లలేనివారు చాలా మందే ఉన్నారన్న అతిశయోక్తి కాదనే రోజులు ఇప్పుడు ఉన్నాయి! తెలిసిన లొకేషన్ కి అయినా, తెలియని లొకేషన్ కి అయినా గూగుల్ మ్యాప్ పై ఆధారపడటం అలవాటు అయిపోయింది! ఈ క్రమంలో ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి సంస్థలూ వీటినే ఉపయోగించి వ్యాపారం చేస్తున్నాయనే చెప్పాలి! ఈ క్రమంలో తాజాగా ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా... గూగుల్ మ్యాప్స్ కు బదులుగా ఓలా క్యాబ్స్ తన సొంత ఇంటర్నల్ ఓలా మ్యాప్ లనే ఉపయోగిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఈ ప్రక్రియలో కంపెనీ సుమారు రూ.100 కోట్లు ఆదా చేస్తుందని ఆయన తెలిపారు. కారణం... ఏడాదిలో సుమారు వందకోట్ల రూపాయలు గూగుల్ మ్యాప్స్ కోసం ఓలా ఖర్చు చేస్తుంది. దీంతో... తాజా నిర్ణయంతో ఇకపై ఆ ఖర్చు ఉండదని భవిష్ చెబుతున్నారు.

ఇలా ఓలా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఓలా తాజా నిర్ణయం.. ఇకపై థర్ద్ పార్టీల మీద ఆధారపడి ముందుకు వెళ్లకూడదని అనుకున్నట్లుగా చెబుతుందని అంటున్నారు. ఈ నిర్ణయంతో ఓలా కంపెనీ మరింత స్వతంత్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో ఈ మార్పు కేవలం డబ్బులు ఆదా చేయడం కోసం మాత్రమే కాదని.. త్వరలో దీనిపై ప్రస్తుతం గూగుల్ చేస్తున్న తరహా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించొచ్చని అంటున్నారు!

ఈ క్రమంలో లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా డబ్బు సంపాదించడ్దానికి కొత్త మార్గాలను కనుగొనడంతో పాటు వారి సేవలను ప్ర్జలకు మరింత చేరువగా, మరింత మెరుగ్గా చేసే ఆలోచనకు ఇది శ్రీకారం చుడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కచ్చితంగా పరిశ్రమను మార్చే చర్యగానే పలువురు అభివర్ణిస్తున్నారు.

అయితే... ఈ సేవలు పొందడానికి వినియోగదారులు ప్రస్తుతం ఉన్న ఓలా యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో... త్వరలో స్ట్రీట్ వ్యూ, త్రీడీ మ్యాప్స్, ఇండోర్ ఇమేజెస్, డ్రోన్ మ్యాప్స్ తదితర ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి!