రెండో పెళ్లికి ఒప్పుకోలేదని కొడుకును చంపిన 76 ఏళ్ల తండ్రి
తనకు ఓ పెళ్లాం కావాలని.. పెళ్లి చేసుకుంటానని 76 ఏళ్ల వయసులో మంకు పట్టు పట్టాడు.
By: Tupaki Desk | 12 March 2025 2:00 AM ISTఏడుపదుల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.? కృష్ణా రామా అంటూ వృద్ధాప్య జీవితాన్ని మనవలు, మునిమనవళ్లతో వెళ్లదీస్తారు. కానీ ఈ ముసలోడికి దసరా రైక లాంటి కోరిక పుట్టింది. తనకు ఓ పెళ్లాం కావాలని.. పెళ్లి చేసుకుంటానని 76 ఏళ్ల వయసులో మంకు పట్టు పట్టాడు. ఒప్పుకోని కొడుకును ఏకంగా కాల్చి చంపిన దారుణం వెలుగుచూసింది. ఈ దారుణమైన విషాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్ జిల్లాలోని జాస్థాన్ పట్టణంలో 76 ఏళ్ల వృద్ధుడు తన కుమారుడిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న తన నిర్ణయానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ అమానుష చర్యకు పాల్పడ్డాడు.
-కుటుంబం వ్యతిరేకించగా..
రామ్ బోరిచా అనే 76 ఏళ్ల వృద్ధుడు తన 52 ఏళ్ల కుమారుడు ప్రతాప్ ఇంటి పక్కనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతాప్ తన భార్య జయ, కుమారుడు జైదీప్‌తో కలిసి వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. రామ్ బోరిచా భార్య 20 ఏళ్ల క్రితం మృతి చెందింది. అయితే ఒంటరితనాన్ని మళ్లీ పెళ్లి చేసుకుని పోగొట్టుకోవాలనే ఆలోచన అతనిలో కలిగింది.
ఈ విషయాన్ని కుమారుడు ప్రతాప్, కోడలు జయ, మనవడు జైదీప్‌లకు తెలియజేశాడు. అయితే వారు అందరూ ఇందుకు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం కుటుంబ పరువుకు మాయని మచ్చ అని చెప్పి పెళ్లి వద్దని చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ రామ్ బోరిచా తన మాట వినడం లేదని కుమారుడిపై తీవ్రంగా స్పందించాడు.
ఆదివారం రోజున, మనవడు జైదీప్ పాలు తెచ్చేందుకు బయటకు వెళ్లగా, ప్రతాప్ తన తండ్రిని టీ తాగేందుకు పిలవడానికి వెళ్లాడు. అయితే అప్పటికే తుపాకీ పట్టుకుని సిద్ధంగా ఉన్న రామ్ బోరిచా, కుమారుడిని గదిలో బంధించి రెండు సార్లు కాల్చి చంపేశాడు.
తుపాకీ శబ్దం విన్న ప్రతాప్ భార్య జయ, మామ ఇంట్లోకి వెళ్లి భర్తను రక్తపు మడుగులో పడి ఉన్నట్లు చూసింది. షాక్‌కు గురైన ఆమెను కూడా చంపేందుకు రామ్ బోరిచా ముందుకు వచ్చాడు. అయితే భయంతో ఆమె వెంటనే బయటకు పరుగులు పెట్టి తలుపులు వేసుకుంది. కొద్ది సేపటికి పాల కోసం వెళ్లిన జైదీప్ తిరిగి వచ్చి తండ్రి పరిస్థితిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తలుపులు తెరిచారు. రామ్ బోరిచాను అరెస్ట్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విచారణలో రామ్ బోరిచా తన కుమారుడిని హత్య చేసినందుకు అసలు పశ్చాత్తాపం లేదని వెల్లడించాడు. గత కొంత కాలంగా కుమారుడు తనను వేధిస్తున్నాడని చెప్పాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వృద్ధుడి నిష్థూరమైన చర్యపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.