దారుణం... 13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి..!!
ఇలా ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో... వాళ్లు ఎంట్రీ ఇచ్చారు.
By: Tupaki Desk | 7 May 2024 4:30 AM GMTఅత్యంత దౌర్భాగ్యకరమైన విషయాల్లొ బాల్య వివాహాలు ఒకటనేది తెలిసిన విషయమే. కారణాలు ఏవైనా చిన్న చిన్న ఆడపిల్లలకు బలవంతంగా పెళ్లిల్లు చేస్తున్న దారుణాలు ఏదో మూల వెలుగులోకి వస్తూనే ఉంటున్నాయి! ఈ క్రమంలో తాజాగా 13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో వివాహం చేయడానికి ప్లాన్ చేశారు. ఈ దారుణ ఘటన పక్క దేశం పాకిస్థాన్ లో జరిగింది.
అవును... పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు, 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు! దీంతో... ఈ వార్త అక్కడి మీడియాలో హెడ్ లైన్ గా మారింది.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది! ఆ మైనర్ బాలికకు ఆమె తండ్రి, వృద్ధుడితో వివాహం చేశాడు! దీంతో విషయం పోలీసులకు తెలిసింది.
ఇలా ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో... వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం... ఆ వృద్ధ వరుడితో పాటు బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో.. ఆ వివాహ వేడుక నిర్వహిస్తున్న అధికారితో పాటు సాక్షులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ మైనర్ వధువును వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వాస్తవానికి పాకిస్థాన్ దేశంలోని చట్టాల ప్రకారం ఆడపిల్లల కనీస వివాహ వయసు 16 ఏళ్లు కాగా, అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా ఉంది. ఇదే సమయంలో... ఆడపిల్ల వివాహ వయసు 18కి పెంచాలనే వాదన బలంగా ఉంది. అయితే... కనీస వివాహ వయసును 18 ఏళ్లు పెంచాలనే నిర్ణయాన్ని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలోని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు!
ఈ క్రమంలోనే 13ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకోవడానికి 70 ఏళ్ల వృద్ధుడు సిద్ధమవ్వడం.. ఈ వివాహం జరిపించడానికి పెద్దలు కూడా రెడీ అయ్యి రావడం జరిగిందని తెలుస్తుంది!! అయితే ఈ విషయంపై పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవ్వడంతో ఆ వృద్ద వరుడు, ఆ మైనర్ బాలిక తండ్రి పోలీసుల అదుపులో ఉన్నారు!!
ఈ విషయాలపై స్పందించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోషన్ అలీ మాట్లాడుతూ... ఈ సంఘటనలో పాల్గొన్న ఇరుపక్షాల వారినీ అదుపులోకి తీసుకున్నామని, చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.