పంది కిడ్నీని అతడికి అమర్చారు.. ప్రపంచంలోనే తొలిసారి
అంతకంతకూ విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత దన్నుగా చేసుకుంటూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 22 March 2024 4:34 AM GMTఅంతకంతకూ విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత దన్నుగా చేసుకుంటూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి పనే చేశారు అమెరికాకు చెందిన కొందరు వైద్యులు. తాజాగా బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీని అమర్చిన వైనం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారి ఈ తరహా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. మనుషుల ప్రాణాల్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ అరుదైన సర్జరీని నిర్వహించారు.
జన్యు సవరణ విధానంలో డెవలప్ చేసిన పంది కిడ్నీని 62 ఏళ్ల రోగికి అమర్చారు. జీవించి ఉన్నవ్యక్తికి పంది కిడ్నీని అమర్చటం ప్రపంచంలోనే ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మసాచుసెట్స్ కు చెందిన వైద్యలు ఈ ఘనతను సాధించారు. సర్జరీ తర్వాత అవయువ గ్రహీత బాగానే కోలుకుంటున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఈ నెలలోనే సర్జరీ పూర్తి చేశారు. త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నారు.
గతంలోనూ పంది కిడ్నీలను తాత్కాలికంగా మార్పిడి చేయటం.. గుండెను కూడా మార్చటం తెలిసిందే. అయితే.. పంది గుండెను అమర్చిన ఇద్దరు కూడా సర్జరీ జరిగిన కొన్ని నెలలకే తుదిశ్వాస విడిచారు. కిడ్నీ విషయంలో అలా జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత రోగి ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లు రాబోయే రోజుల్లో చర్యలు ఉంటాయని చెప్పక తప్పదు. ఏమైనా మానవాళికి ఇదో గుడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.