జనసేనలోకి పాత నీరు...నిండుతున్న గాజు గ్లాస్...!
పొత్తులో భాగంగా టీడీపీని ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు డిమాండ్ చేయడానికి జనసేన చూస్తోంది.
By: Tupaki Desk | 20 Jan 2024 11:30 PM GMTజనసేన వచ్చే ఎన్నికలో పోటీకి రెడీ అవుతోంది. టీడీపీతో పొత్తు ఉంది. దాంతో బాగానే సీట్లు గెలుచుకోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా టీడీపీని ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు డిమాండ్ చేయడానికి జనసేన చూస్తోంది. అయితే జనసేనలో చాలా చోట్ల అభ్యర్ధులు గట్టి వారు లేరు అన్న మాట ఉంది.
దాంతో ఆ పార్టీకి ఒక అవసరం అయితే చాలా మందికి అది రాజకీయ అవకాశంగా మారుతోంది. దాంతో వైసీపీలో చోటు లేక టీడీపీలో సీటు రాక ఇబ్బంది పడుతున్న వారు అంతా జనసేన రూట్ లోకి వెళ్తున్నారు. జనసేనలో అయితే కచ్చితంగా సీటు వస్తుంది. పొత్తుల వల్ల మరోసారి గెలిచి రావచ్చు అన్న లెక్కలతోనే తలపండిన సీనియర్లు పలు మార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు అంతా జై జనసేన అంటున్నారు.
నిజానికి చూస్తే పాత కాపులే జనసేన వైపు రావడం విశేషం. వారంతా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అన్నిటికీ మించి వైఎస్సార్ కి సన్నిహితులుగా ఉన్న వారు. ఇపుడు వీరు పవన్ తో జట్టు కట్టడం విశేషంగా ఉంది. ఇక వీరి రాజకీయ ప్రవేశం మొదట కాంగ్రెస్ ఆ తరువాత వైసీపీగా సాగింది.
ఇదిలా ఉంటే వల్లభనేని బాలశౌరి వైసీపీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన 2014, 2019లలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేస్తే రెండవ సారి గెలిచారు. ఇక అంతకు ముందు బాలశౌరి కాంగ్రెస్ లో ఎంపీగా ఉన్నారు. ఆయన ఇపుడు వైసీపీలో ఉంటే తనకు సీటు దక్కదని భావించి జనసేన రూట్ ఎంచుకున్నారు. దానికంటే ముందు ఆయన చిరంజీవి పట్ల తన అభిమానాన్ని చూపించారు. అలాగే తాను మొదట కాంగ్రెస్ వాదిని అంటూ చెప్పుకున్నారు.
ఆ కాంగ్రెస్ వాసనలతో ఆయన పార్టీ మారారు అని సెటైర్లు పేల్తున్నాయి. మొత్తానికి బాలశౌరి పవన్ ని కలసి సుదీర్ఘంగా చర్చించారు. ఆయన మరోసారి మచిలీపట్నం నుంచి అయినా లేక గుంటూరు నుంచి అయినా పోటీ చేయవచ్చు అని అంటున్నారు. ఆ మేరకు ఆయన ఎంపీ సీటుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు.
మరో కీలక నేత సీనియర్ రాజకీయవేత్త అయిన కొణతాల రామక్రిష్ణ కూడా జనసేన వైపే నడిచారు. ఆయన కూడా వైఎస్సార్ భక్తుడు. ఆయన వైఎస్సార్ చలువతోనే రాజకీయంగా రాణించారు. ఎంపీగా రెండు సార్లు చేసి మంత్రిగా అయిదేళ్ల పాటు ఉన్న కొణతాల రామక్రిష్ణ పవన్ తో భేటీ అయి అన్ని విషయాలు మాట్లాడారు.
ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అటువంటి కొణతాల వైఎస్సార్ మరణానంతరం వైసీపీని ఎంచుకున్నారు. ఆయన వైసీపీలో చాలా కాలం పాటు ఉన్నారు. అయితే అక్కడ ఇమడలేకపోయారు.
ఆయన కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. 2024 ఎన్నికల వేళ ఆయన పవన్ తో భేటీ వేసేసరికి కచ్చితంగా ఆ పార్టీలో చేరుతారు అని అంటున్నారు. ఆయన అనకాపల్లి నుంచి జనసేన నుంచి పోటీ చేస్తే టీడీపీ పొత్తులో మద్దతు ఇస్తుందని అందువల్ల గెలుపు సునాయాసం అని లెక్కలేసుకుంటూ గాజు గ్లాస్ పార్టీలో చేరుతున్నారు అని అంటున్నారు.
ఇక పొత్తులో భాగంగా కనీసంగా అయిదు ఎంపీ సీట్లు జనసేన అడగాలని చూస్తోంది. దాంతో ఆ పార్టీకి అయిదు సీట్లకు ఎంపీ అభ్యర్ధులు కావాల్సి ఉంది అని అంటున్నారు. దాంతో పాత కాపులను చేర్చుకుంటోంది అని అంటున్నారు. ఇక తమకు కూడా రాజకీయ వేదికగా జనసేనను భావిస్తూ ఈ నేతలు చేరుతున్నారు అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో చాలా ఎన్నికలను చూసిన ఈ పాత కాపులు వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఏ మేరకు మెప్పించి విజయాన్ని అందుకుంటారు అనేది చూడాల్సి ఉంది.