20 వేల కి.మీ. జర్నీ చేసి వచ్చి కాకినాడ తీరంలో చచ్చిపోవటమా?
ఇక్కడే మరో కీలక అంశాన్ని ప్రస్తావించాలి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తమ సంతానం కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు వీలుగా ఒక లెక్క ఉందని చెబుతారు.
By: Tupaki Desk | 30 Dec 2024 8:30 AM GMTఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావటమంటే మాటలు కాదు. మనిషి మాదిరి ఫ్లైట్ వేసుకొని.. మధ్యలో కాస్తంత బ్రేక్ తీసుకొని వచ్చేయటం కాదు. నెలల తరబడి ప్రయాణించి..వందల ఏళ్లుగా తమకు అనువుగా ఉన్న ప్రాంతానికి వస్తున్న నోరు లేని జీవాలు ఒక సంస్థ దుర్మార్గానికి.. కక్కుర్తికి వేలాదిగా బలి కావటానికి మించిన కిరాతకం ఇంకేం ఉంటుంది? ఆలివ్ రిడ్లీ తాబేళ్ల గురించి వినే ఉంటారు. అరుదైన ఈ తాబేళ్లు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి.. తమ సంతానాన్ని పెంచుకోవటానికి వీలుగా ఒడిశా.. ఏపీలోని పలు ప్రాంతాలకు వస్తుంటాయి. అది కూడా వేలాదిగా.
అలా వచ్చే మూగజీవాలకు మనిషి కక్కుర్తి గురించి ఏం తెలుసు? తన స్వార్థం తప్పించి మరింకేమీ పట్టని మనిషి తీరు కారణంగా వేలాదిగా మరణిస్తున్న వైనం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చేరింది. వెంటనే స్పందించిన ఆయన.. కాకినాడ తీరంలో వేలాదిగా చనిపోతున్నఈ తాబేళ్ల లెక్క తేల్చాలన్న ఆదేశాలతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ తీరంలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దుర్మార్గ పనిగా గుర్తించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టును సిద్ధం చేశారు.
ఇదంతా సరే.. ఇంతకూ ఈ తాబేళ్లు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి మన దగ్గరకే ఎందుకు వస్తాయి? ఇలా రావటం వెనకున్న కారణాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. బోలెడన్ని ఆసక్తికర అంశాలు బయటకు రావటమే కాదు.. మనిషి కక్కుర్తి కారణంగా వేలాదిగా మ్రత్యువాత పడుతున్న వైనం గురించి తెలిసినప్పుడు మనసు వేదనకు గురి కావటం ఖాయం. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎందుకు వస్తాయంటే.. గుడ్లు పెట్టటానికి. వేలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఏమిటి? అన్న సందేహం రావొచ్చు. దానికో కారణం ఉంది.
అందరూ కొలిచే దేవుడికి ప్రతిరూపంగా పలువురు ప్రకృతినే దేవుడిగా కొలుస్తుంటారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల గురించి తెలిసినప్పుడు ప్రకృతి గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. అరుదైన ఆలివ్ రిడ్లేతాబేళ్లు మొత్తం 7 రకాల జాతులు ఉంటాయి. వీటిలో ఐదు రకాలు జపాన్.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి 2 అడుగుల వెడల్పు.. 50 కేజీల వరకూ బరువు పెరిగే ఈ తాబేళ్లకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. మరే ప్రాణికి కూడా ఇలాంటి అలవాటు ఉండదేమో?
అదేమంటే.. ఈ తాబేళ్లు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్డు పెడుతుంది. అంటే.. తన జన్మస్థలాన్ని గుర్తు పెట్టుకొని మరీ.. తాను ఫలదీకరణ వేళకు పుట్టింటికి వస్తుందన్న మాట. అలా ప్రపంచంలో ఏ మూలన ఉన్నప్పటికి గుడ్డు పెట్టే వేళకు మాత్రం తాను పుట్టిన ప్రాంతానికి వచ్చేయటం వీటి ప్రత్యేకత. అలా మన దేశానికి వచ్చే ప్రాంతాల్లో ఒడిశా తీరంతోపాటు ఏపీలోని కాకినాడ తీరం.. ఉప్పాడ.. హోప్ ఐలాండ్.. కోరంగి అభయారణ్యం.. క్రిష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు వస్తాయి. గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం.. బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి.
ఒకేసారి వేలాదిగా వచ్చే ఈ తాబేళ్ల తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్డు పెట్టినప్పటికీ.. అందులో నుంచి పిల్లలుగా రావటానికి ప్రత్యేక వాతావరణ పరిస్థితులే కాదు.. మగ.. ఆడ ఎలా పుట్టాలన్నది కూడా ఉష్ణోగ్రతలే డిసైడ్ చేస్తాయి. 28-32 డిగ్రీల మధ్య ఈ తాబేళ్లు పిల్లలుగా గుడ్ల నుంచి బయటకు వస్తాయి. 30-32 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య గుడ్ల నుంచి బయటకు వచ్చే తాబేళ్లు ఆడవిగా ఉంటాయి. అంతకు తక్కువ ఉష్ణోగ్రతల మధ్య గుడ్ల నుంచి బయటకు వచ్చే తాబేళ్లు మగవిగా ఉంటాయి. ఈ సృష్టి ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందని చెబుతారు.
ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది అక్టోబరు.. నవంబరు నెలల్లో ఫలదీకరణ కోసం వస్తాయి. ఇందుకోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డిసెంబరు.. జనవరి.. ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇందుకోసం అవి పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఇసుకలో 30 నుంచి 45 సెంటీమీటర్లలోతున కుండాకారంలో గొయ్యి తీసుకుంటాయి. ఒక్కో గొయ్యిలో 60-120 వరకు గుడ్లు పెడతాయి. గొయ్యి తీసుకోవటం మొదలు గుడ్లు పెట్టేందుకు 45 నిమిషాల నుంచి గంట (60 నిమిషాలు) టైం తీసుకుంటాయి.
ఇక్కడే మరో కీలక అంశాన్ని ప్రస్తావించాలి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తమ సంతానం కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు వీలుగా ఒక లెక్క ఉందని చెబుతారు. దాదాపు 25 డిగ్రీల అక్షాంశంలో ఉన్న బీచ్ లను ఈ తాబేళ్లు కోరుకుంటాయి. ఇందు కోసం సముదర ప్రవాహాలు.. సూర్యుని స్థానం.. ఉపరితల గాలులు.. ఉష్ణోగ్రత.. రుతువులు.. చంద్రుడు లాంటి పర్యావరణ సూచనల్ని ఆధారంగా చేసుకొని ఈ తాబేళ్లు తమ ఫలదీకరణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవటం గమనార్హం.
తమకు అనువైన ప్రాంతంలోని సముద్ర తీరంలో గొయ్యి తీసి పెట్టిన గుడ్లు 45-60 రోజుల వరకు ఉంటాయి. ఇదే సమయంలోనే గుడ్ల నుంచి పిల్లలుగా బయటకు వస్తాయి. వేలాదిగా వచ్చే తాబేళ్లు అంతకు వందల రెట్టింపు గుడ్లు పెట్టేసి.. తమ జాతిని పెంచేసుకొని మళ్లీ వెళ్లిపోతాయి. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు పర్యావరణానికి చేసే మేలు ఎంతో. సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచటమే కాదు.. చేపల సంతానం పెంచేందుకు సాయం చేస్తాయి. ఎందుకుంటే.. చేప పిల్లల్ని తినే జెల్లీ చేపల్ని ఈ తాబేళ్లు తింటాయి. దీంతో.. చేపల ఉత్పత్తికి సాయం చేస్తాయి.
తాబేళ్లకు ఉన్న మరో అలవాటు ఏమంటే.. సముద్రంలో తామెంత లోతులో ఉన్నప్పటికి ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకొని లోపలకు వెళతాయి. ఇవి నీటిపైకి..కిందకు వెళ్లిరావటం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. మన దేశానికి వచ్చే ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఫలదీకరణ కారణంగా.. ఈ జాతి ప్రపంచ జనాభాలో 50 శాతం.. భారతీయ జనాభాలో 90 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంటాయి.