Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి జేబుల్లో చేతులు పెట్టుకోవ‌డం ఏంటి.. చెండాలం: స్పీక‌ర్

పార్ల‌మెంటులో స‌భ్యులు ఎలా వ్య‌వ‌హ‌రించాలో.. ఎలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దో చెప్ప‌డానికి కొన్ని నియ‌మాలు, నిబంధ‌న‌లు కూడా ఉన్నాయి

By:  Tupaki Desk   |   27 July 2024 2:04 PM GMT
కేంద్ర మంత్రి జేబుల్లో చేతులు పెట్టుకోవ‌డం ఏంటి.. చెండాలం:  స్పీక‌ర్
X

పార్ల‌మెంటులో స‌భ్యులు ఎలా వ్య‌వ‌హ‌రించాలో.. ఎలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దో చెప్ప‌డానికి కొన్ని నియ‌మాలు, నిబంధ‌న‌లు కూడా ఉన్నాయి. అయితే.. కొందరు వాటిని పాటిస్తున్నారు.. మ‌రికొంద‌రు పాటించ‌డం లేదు. గ‌తంలో ప్ర‌ధాని మోడీని చూసి.. రాహుల్ క‌న్నుకొట్ట‌డం.. ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. మాట్లాడ‌డం వంటివి వివాదానికి దారి తీశాయి. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల‌కు ఇలా చేయ‌డం విఘాత‌మ‌ని కూడా అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే..త‌ర్వాత‌.. స‌ర్దుమ‌ణిగిపోయింది.

ఇక‌, పార్ల‌మెంటులోకి స‌భ్యులు ప్ల‌కార్డులు తీసుకురాకూడ‌ద‌న్న నిబంధ‌న ఉన్నా.. ఏదో ఒక రూపంలో కార్డుల‌ను తీసుకువెళ్తూనే ఉన్నారు. ఇటీవ‌ల తాజాగా ప్రారంభ‌మైన బ‌డ్జెట్ స‌భ‌లోనూ కొన్ని కొన్ని నిబంధ‌న‌లు పెట్టారు. అరుపులు కేక‌లు పెట్ట‌కూడ‌ద‌ని.. పోడియంను చుట్టు ముట్ట‌కూడ‌ద‌ని, చ‌ర్చ‌ను సాగ‌దీయరాద‌ని ఇలా అనేక కొత్త నియ‌మాలు పెట్టారు. ఇక‌, ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఒక‌రు చేసిన వ్య‌వ‌హారంతో స‌భలో మ‌రిన్ని కొత్త నిబంధ‌న‌లు తీసుకువ‌స్తూ.. స్పీక‌ర్ ఓం బిర్లా నిర్ణ‌యం తీసుకున్నారు.

శ‌నివారం నాటి స‌భ‌లో కేంద్ర మంత్రి ఒక‌రు మాట్లాడుతూ.. త‌న ఫ్యాంటు జేబులో రెండు చేతులు పెట్టుకుని.. నిల‌బ‌డ్డ చోటే అటు-ఇటు తిరుగుతూ.. మాట్లాడారు. దీనిని కొన్నినిమిషాల పాటు ప‌రిశీలించిన స్పీక‌ర్ ఓం బిర్లా.. తీవ్రంగానే హెచ్చ‌రించారు. ``మీరు కేంద్ర మంత్రి. జేబుల్లో చేతులు పెట్టుకుని.. అటు ఇటు తిరుగుతూ మాట్లాడ‌డం ఏంటి? చెండాలం. ఇది స‌భ నియ‌మాల‌కు, గౌర‌వానికి కూడా విరుద్ధం`` అని అన‌డంతో వెంట‌నే మంత్రి వ‌ర్యులు అలెర్ట్ అయ్యారు.

అనంత‌రం.. ఓం బిర్ల మాట్లాడుతూ.. స‌భ‌లో కొంద‌రు ఇంకా ఇష్టానురీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. ఎవ‌రికి తోచిన‌ట్టు వారు ఉన్నార‌ని.. ఇక‌పై అలా ఉండేందుకు వీల్లేద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ నియ‌మా లు పాటించాల‌న్నారు. ఒక స‌భ్యుడు మాట్లాడుతూ ఉంటే.. ఆయ‌న‌కు ఎదురుగా ఎవ‌రూ న‌డ‌వ కూడ‌ద న్నారు. అలాగే చేతులు జేబుల్లో పెట్టుకోవ‌డం.. విసురుగా గాలిలోకి ఊప‌డం స‌రికాద‌ని హెచ్చ‌రించారు.