మరోసారి కేసీఆర్ నోట దుమ్ము రేగదా మాట.. ఎందుకంటే?
మొన్నటికి మొన్న ఎంపీ కం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్త ప్రభాకర్ పై కత్తిపోటు చోటు చేసుకున్న నేపథ్యంలో.. ఆయన తీవ్రంగా రియాక్టు అయ్యారు.
By: Tupaki Desk | 2 Nov 2023 4:18 AM GMTతన నోటి నుంచి వచ్చే మాటలకు ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అల్లుకుపోవటం గులాబీ బాస్ కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆయన నోటి నుంచి వస్తున్న మాటల్ని చూస్తే.. ఇటీవల ఆవేశంతో అన్న మాటలకు ప్రజల ఆదరణను గమనించిన ఆయన.. అదే మాటను పదే పదే ప్రస్తావిస్తున్నారు. తన సభలకు వస్తున్న వారిని ఉర్రూతలూగిస్తున్నారు. మొన్నటికి మొన్న ఎంపీ కం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్త ప్రభాకర్ పై కత్తిపోటు చోటు చేసుకున్న నేపథ్యంలో.. ఆయన తీవ్రంగా రియాక్టు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆగ్రహానికి గురవుతూ.. తమ పార్టీ వారు చెలరేగిపోతే.. ప్రత్యర్థి పార్టీల పరిస్థితేంటన్న ఆయన.. మేం తలుచుకుంటే దుమ్ము రేగదా? అంటూ ఫైర్ అయ్యారు.
మాటల్లో ఆవేశాన్ని.. ఆగ్రహాన్ని ప్రదర్శించటం కేసీఆర్ కు కొత్తేం కాకున్నా.. ఈ స్థాయిలో ఆయన విరుచుకుపడటం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. నాటి నుంచి తరచూ ఆయన తాను పాల్గొంటున్న బహిరంగ సభల్లో మాటల దూకుడును పెంచారు. తాజాగా ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ తుమ్మలపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు కరటక దమనకులు ఉన్నారని.. ఒకాయన బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు తాకనీయమంటున్నారంటూ.. ‘‘నాలుగు పైసలు జేబుల్లోకి రాగానే ఎంత అహంకారం? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తుందా? ఈ సభలోని ప్రజా సమూహం తలుచుకుంటే దుమ్ము రేగదా?’’ అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వరుసగా నాలుగోసారి అసెంబ్లీలో అడుగుపెడతారంటూ.. ‘సండ్ర పహిల్వాన్ లా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఉంటారా? ఖమ్మం ఎంపీగా నామా ఇంకోసారి పార్లమెంటుకు వెళ్లకుండా ఆపగలరా?’ అని ప్రశ్నించారు. తాను హాజరయ్యే బహిరంగ సభల్లో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ.. గులాబీ దళంలో కొత్త ఉత్సాహాన్ని పెంచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు.