Begin typing your search above and press return to search.

మరోసారి చలానాలా మేళా.. రెఢీ అవుతున్న రేవంత్ సర్కార్

తాజాగా ఇదే తరహాలో రాయితీలు ఇవ్వాలన్న ఆలోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:14 AM GMT
మరోసారి చలానాలా మేళా.. రెఢీ అవుతున్న రేవంత్ సర్కార్
X

ఎడాపెడా ట్రాఫిక్ చలానాలు వడ్డించే విషయంలో తెలంగాణ పోలీసులు.. అందునా హైదరాబాద్ మహానగర పోలీసుల తీరు ఒక రేంజ్ లో ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కొండలా పేరుకు పోయిన చలానాల్ని ప్రజల నుంచి వసూలు చేసేందుకు వీలుగా.. ఆ మధ్యన కేసీఆర్ సర్కారు హయాంలో ట్రాఫిక్ చలానాల మేళాను నిర్వహించి.. భారీ ఎత్తున రాయితీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ.300కోట్ల మేర వసూలు కావటం తెలిసిందే.

తాజాగా ఇదే తరహాలో రాయితీలు ఇవ్వాలన్న ఆలోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయన్న మాట వినిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చలానాలు విధించే పోలీసులు.. హైదరాబాద్ మహానగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇతర కమిషనరేట్లు.. జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్నతరహా పట్టణాల్లోనూ చలానాలు విధిస్తూ ఉండటం తెలిసిందే.

ట్రాఫిక్ నియంత్రణ కంటే కూడా చలానాలు వడ్డించే విషయంలోనూ ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారన్న ఆరపణ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే.. పోలీసుల తీరు ఉంటుందని చెప్పాలి. ఈ కారణంగా ఒక్కో వాహనం మీద పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్ లో ఉంటాయి. వీటిని తగ్గించుకోవటానికి వీలుగా.. గత ఏడాది టూ వీలర్లపై ఉన్న చలానాలకు 75 శాతం.. మిగిలిన వాహనాల మీద ఉన్న చలానాలకు 50 శాతం రాయితీ ఇచ్చారు. ఈ పథకానికి విశేష స్పందన లభించింది.

కేవలం 45 రోజుల వ్యవధిలో దాదాపు రూ.300 కోట్లకు పైనే చలానాలు వసూలు అయ్యాయి. పెండింగ్ లో ఉన్న చలానాల్లో దాదాపు 65 శాతం పూర్తి కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మళ్లీ పెండింగ్ చలానాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో (ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు అంచనా)లో.. మరోమారు చలానాల మేళాను నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు.