మల్లారెడ్డిని మళ్లీ గెలికారు !
చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి.
By: Tupaki Desk | 24 May 2024 2:03 PM GMTతెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శామీర్‌పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జేసీబీలతో ప్రహరీగోడను కూల్చివేశారు.
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఇదే పెద్దచెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు. గత కొన్నిరోజులుగా అక్రమ నిర్మాణాలు అంటూ మల్లారెడ్డికి చెందిన, అల్లుడు రాజశేఖర రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్‌లను అధికారులు వరసగా కూల్చి వేస్తున్నారు.
ఇటీవల భూ ఆక్రమణ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ మల్లారెడ్డి భూములలో రేకుల షెడ్లను తొలగించాడు. దీనిని మల్లారెడ్డితో పాటు అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు కలిసి అడ్డుకోవడం, కేసులు నమోదు కావడం తెలిసిందే. తాజాగా వారివి అక్రమ నిర్మాణాలు అంటూ మరోసారి అధికారులు కూల్చివేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ పట్ల వ్యవహరిస్తున్న విషయంలో మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి బెంగుళూరులో ఉప ముఖ్యమంత్రి డీకేతో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల అడ్లూరి లక్ష్మణ్ తో జరిగిన వివాదంలో నేరుగా ముఖ్యమంత్రి ముందు ఆధారాలు చూపిస్తాం అన్న నేపథ్యంలో తాజా దాడులు చర్చానీయాంశం అయ్యాయి.