జమిలి ఎన్నికలు అంటే అధ్యక్ష తరహా పాలన ?
భారతదేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు పేరున పాలన సాగుతుంది. పాలించేది ప్రధానమంత్రి. ఆయన ప్రజల నుంచి వస్తారు.
By: Tupaki Desk | 23 Oct 2024 8:30 AM GMTభారతదేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు పేరున పాలన సాగుతుంది. పాలించేది ప్రధానమంత్రి. ఆయన ప్రజల నుంచి వస్తారు. ఇది బ్రిటిష్ రాజ్యాంగం తరహాలోనిది. అక్కడ రాజు ఉంటారు. వారిని గౌరవ స్థానంలో ఉంచి ప్రధానమంత్రి వారి పేరిట పాలన చేస్తారు.
ఇక అమెరికాలో అధ్యక్ష తరహా పాలన ఉంది. అలాగే చైనాలో అధ్యక్షుడే పాలకుడు. అక్కడ పూర్తి ఆధిపత్యంతో పాలన సాగుతుంది. ఇలా అనేక దేశాలు ఉన్నాయి. భారత్ మాత్రం దాదాపుగా ఎనిమిది దశాబ్దాలుగా ప్రజాస్వామ్య స్పూర్తితో ఇదే తరహా పాలనా విధానం అవలంబిస్తోంది.
అయితే జమిలి ఎన్నికల తరువాత అధ్యక్ష తరహా పాలన వస్తుందని పలువురు సందేహిస్తున్నారు. నిజంగా అలా జరుగుతుందా దానికి ఎంత వరకూ అవకాశాలు ఉన్నాయని కనుక చూస్తే ముందుగా జమిలి ఎన్నికల గురించి తీసుకుంటే దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రంలోని లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ ఎన్నికలలో జాతీయ పార్టీలదే ప్రభావం ఉంటుంది. జాతీయ పార్టీల మధ్య సమరంతో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఇరుకున పడతాయి. అంతే కాదు ఆ పార్టీలు ఉనికి కోసం ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు కట్టాల్సి ఉంటుంది. లేకపోతే మనుగడకే ఇబ్బంది ఎదురవుతుంది. ఈ క్రమంలో జాతీయ పార్టీలే నెగ్గుతాయి. లేదా వారు నాయకత్వం వహించే కూటములే అధికారంలోకి వస్తాయి.
దాంతో స్థానికంగా ప్రాంతీయ ఆకాంక్షలకు అవకాశం కానీ అధికారం కానీ బాగా తగ్గిపోతుంది అన్న చర్చ ఉంది. ఇక అధ్యక్ష తరహా పాలన అంటే దేశాధ్యక్షుడిని నేరుగా ప్రజలు ఎన్నుకోవడం అన్న మాట. అలా ఎన్నుకున్న తరువాత ఆయనే మంత్రివర్గాన్ని కేంద్రంలో ఏర్పాటు చేస్తారు. తాను సిఫార్సు చేసిన వారితోనే పాలన సాగుతుంది. అంటే ఇక్కడ అధ్యక్షుడు అత్యంత పవర్ ఫుల్ అన్న మాట.
అయితే భారత్ లో అధ్యక్ష తరహా పాలన రావాలీ అంటే రాజ్యాంగం సవరణలు చేయాలి. కానీ భయాలు సందేహాలను మాత్రం చాలా మంది జమిలి ఎన్నికలను చూపించి చేస్తున్నారు. లేటెస్ట్ గా చూస్తే సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు ఇదే మాటను చెప్పారు.
దేశంలో చాలా పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు. అయినా సరే బీజేపీ వాటినే నిర్వహించాలని చూస్తోంది. దానికి కారణం జమిలి ఎన్నికల అనంతరం అధ్యక్ష తరహా పాలన తీసుకుని రావాలన్నదే అని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే పాలిస్తాయని వాటిని మధ్యలో రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు. అది ప్రజాభిప్రాయాన్ని కాలరాయడమే అని కూడా అన్నారు. మొత్తానికి జమిలి ఎన్నికల మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు విభిన్నమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.