"వన్ నేషన్ – వన్ ఎలక్షన్"... కీలక ముందడుగు పడింది!
ఇందులో భాగంగా... మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నాలుగోసారి సమావేశమైంది
By: Tupaki Desk | 28 Jan 2024 5:28 AM GMTమొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంగడి ముగిసిన అనంతరం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే. మోడీ హ్యాట్రిక్ విజయమా.. ఇండియా కూటమికి అధికారమా అనేది తేల్చబోయే కీలక ఎన్నికలకు దేశం సమాయత్తమవుతోంది. ఈ సమయంలో మరోసారి "వన్ నేషన్ – వన్ ఎలక్షన్" అంశం తెరపైకి వచ్చింది. ఇందులో కీలక ముందడుగు పడింది.
అవును... దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... వ్యూహాలు రచిస్తూ, అస్త్రాలు సిద్ధంచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఇక యాత్రలు, సభలూ సరేసరి! ఈ నేపథ్యంలో "వన్ నేషన్ – వన్ ఎలక్షన్" కు సంబంధించిన అంశంపై కీలక sTep పడింది.
ఇందులో భాగంగా... మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నాలుగోసారి సమావేశమైంది. ఇప్పటివరకు జరిగిన మూడు భేటీల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల కమిషన్ మాజీ అధికారులను కలిసి.. వారి నుంచి లిఖితపూరకంగా అభిప్రాయాలను సేకరించిన సంగతి తెలిసిందే. "వన్ నేషన్ – వన్ ఎలక్షన్" అమలు వల్ల కలిగే ప్రయోజనాలు, ఇబ్బందికర పరిణామాలపై చర్చించింది.
ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తో ఈ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా "వన్ నేషన్ – వన్ ఎలక్షన్" అమలు అంశం ఎదుర్కోవాల్సిన న్యాయపరమైన ఇబ్బందులు, ఇతర చిక్కులపై చర్చించింది. ఇదే సమయంలో... గోవాకు చెందిన గోమంతక్ పార్టీ అధినేత దీపక్ పాండురంగ్ ధవళికర్ కూడా ఈ కమిటీని కలిశారు. ఈ సందర్భంగా ఈ కాన్స్పెట్ పై ఆయన పాజిటివ్ గా స్పందించారని తెలుస్తుంది.
కాగా... మాజీ రాష్ట్రపతి కోవింద్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్న ఈ కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, లోక్ సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాంనబీ ఆజాద్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.