Begin typing your search above and press return to search.

బీజేపీ లోక్‌ సభ ఎన్నికల మేనిఫెస్టో.. ఈ కీలక హామీలకు చోటు!

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది

By:  Tupaki Desk   |   21 March 2024 7:12 AM GMT
బీజేపీ లోక్‌ సభ ఎన్నికల మేనిఫెస్టో.. ఈ కీలక హామీలకు చోటు!
X

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోపై ఆ పార్టీ దృష్టి సారించింది. మేనిఫెస్టోలో కీలక అంశాలను చేర్చనుందని తెలుస్తోంది. ప్రధానంగా ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు)’, ఏకరీతి పౌరస్మృతి (యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌) వంటి కీలక అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ వర్గాల సమాచారం మేరకు 2029లో లోక్‌ సభ, దేశంలో అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఈ నేపథ్యంలో 2028 చివరిలో పదవీకాలం ముగియనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని 2029 లోక్‌ సభ ఎన్నికల వరకు పొడిగించే అవకాశం ఉంది. అలాగే 2024 తర్వాత ఎన్నికలు జరిగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని తగ్గించవచ్చని అంటున్నారు.

ఈ మేరకు బీజేపీ లోక్‌ సభ ఎన్నికల కోసం తేనున్న మేనిఫెస్టోలో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అంశాన్ని చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇవ్వనుందని అంటున్నారు. అలాగే ఏక పౌరస్మృతిని కూడా మేనిఫెస్టోలో చేర్చొచ్చని చెబుతున్నారు.

ఈ మేరకు బీజేపీ మేనిఫోస్టో రూపకల్పనలో బీజీగా ఉందని అంటున్నారు. ఇప్పటికే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం ఆమోదించవచ్చని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి జమిలి ఎన్నికలు, యూనిఫాం సివిల్‌ కోడ్‌ రెండూ కూడా 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు తగ్గించడం, ప్రభుత్వ వనరులు, భద్రతా బలగాల సమర్ధవంతమైన వినియోగం, సమర్థవంతమైన విధాన ప్రణాళిక కోసం పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాల ఎన్నికల ఆలోచనకు బీజేపీ కట్టుబడి ఉందని 2019 ఎన్నికల మేనిఫెస్టో పేర్కొంది.

అయితే ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే వంటి 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో రామనాథ్‌ కోవింద్‌ కమిటీ కూడా జమిలి ఎన్నికలకు అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగనుందని అంటున్నారు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జమిలి ఎన్నికలకు అంగీకరించని పక్షంలో రాజ్యాంగానికి సవరణ చేయడం ద్వారా జమిలి ఎన్నికలకు కేంద్రం శ్రీకారం చుట్టనుందని చెబుతున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 సెక్షన్‌ల రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అమలు వంటి ప్రధాన హామీలను బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చిన సంగతి తెలిసిందే.