Begin typing your search above and press return to search.

బ్రెజిల్ లో ఒంగోలు అవు సందడి మామూలుగా లేదు.. తెలుసుకోవాల్సిందే!

బ్రెజిల్ మార్కెట్ లో ఒంగోలు జాతి ఆవు ధర రూ.41కోట్లు పలకడం ఇప్పుడు వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   14 March 2025 3:32 PM IST
బ్రెజిల్ లో ఒంగోలు అవు సందడి మామూలుగా లేదు.. తెలుసుకోవాల్సిందే!
X

ఒంగోలు జాతి పశువుల ప్రత్యేకతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లో ఈ జాతి పశువుల సందడి పీక్స్ లో ఉంటుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బ్రెజిల్ మార్కెట్ లో ఒంగోలు జాతీ పశువు రికార్డ్ ధర పలికినట్లు మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకూ ఈ ఆవు ధర ఎంతో తెలుసా?.. అక్షరాలా రూ.41 కోట్లు!

అవును... బ్రెజిల్ మార్కెట్ లో ఒంగోలు జాతి ఆవు ధర రూ.41కోట్లు పలకడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రెజిల్ లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతీ ఆవు (వియాటినా 19 రకం) ఈ అధిక ధరకు అమ్ముడై, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డ్ సృష్టించిందంటూ కథనాలు వచ్చాయి.

వివరాల్లోకి వెళ్తే... ఒంగోలు జిల్లా కేంద్రానికి సుమారు 12 కి.మీ. దూరంలోని "కరవది" గ్రామం ఒకప్పుడు ఒంగోలు జాతి పశువులకు పెట్టింది పేరు. 1960ల్లో ఈ ఊరికి చెందిన పోలవరపు హనుమయ్య.. ఓ బ్రెజిల్ దేశస్తుడికి ఆవును, ఎద్దును అమ్మగా.. వాటి సంతతికి చెందిన ఆవు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో రికార్డ్ ధర పలికింది.

దీంతో... పోలవరపు చెంచురామయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన మాజీ సర్పంచ్ పోలవరపు వెంకట్రామయ్య... తమ గ్రామానికి చెందిన ఆవు వల్ల దేశానికి, రాష్ట్రానికి గొప్ప పేరు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇదే సమయంలో... ఇప్పటికే ఆ ఎద్దు వీర్యాన్ని బ్రెజిల్ లో భద్రపరిచారని ఒంగోలుకు చెందిన రైతు, డాక్టర్ చుంచు చెలమయ్య అన్నారు!

తెల్లని శరీరం, చూపరులను ఆకట్టుకునే మూపురం, రంకెల్లో రాజసం కలగలిపిన ఈ ఒంగోలు జాతి పశువులు సుమారు 1100 కేజీల బరువుతో బలిష్టంగా ఉంటాయి. ఇవి ఎలాంటి వాతావారణాన్నైనా తట్టుకుంటాయి.. అంత తొందరగా అనారోగ్యానికి గురికావని, చురుగ్గా ఉంటాయని చెబుతున్నారు.

అయితే... ఒకప్పుడు బ్రెజిల్ దేశానికి ఎక్కువగా ఎద్దులను ఎగుమతి చేసిన "కరువది"లోనే ఇప్పుడు ఆ ఎద్దులు ఎక్కువగా లేవని ఆ ఊరికి చెందిన రైతులు వాపోతుండటం గమనార్హం. దీంతో... ఒంగోలు జాతి గిత్తల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు.