లక్ కోసం ట్రై చేయొద్దు: గ్యాస్ డెలివరీ బాయ్ కు రూ.కోటిన్నర!
దీంతో అతడికి రూ.1.5కోట్ల భారీ మొత్తం ప్రైజ్ మనీగా లభించింది. దీంతో సాదిఖ్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
By: Tupaki Desk | 20 Jan 2024 4:28 AM GMTఇప్పుడు మీరు చదివే వార్తను.. కేవలం ఆసక్తికర సమాచారంగా మాత్రమే చదవండి తప్పించి.. మనకూ లక్ కలిసి వస్తుందన్న ఉద్దేశంతో మాత్రం ట్రై చేయొద్దు. నిజానికి.. ఈ తరహా వార్తలతో వచ్చే చిక్కేమిటంటే.. తమకు ఇలాంటి జాక్ పాట్ తగులుతుందన్న భ్రమతో గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఈ క్రమంలో అడ్డంగా బుక్ అయి.. డబ్బులు పోగొట్టుకుంటారు. ఇంతకీ విషయం ఏమంటే.. ఇంటింటికి గ్యాస్ బండలు డెలివరీ చేసే బాయ్ ఒకరు రూ.కోటిన్నర జాక్ పాట్ ను సొంతం చేసుకున్నారు.
బిహార్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం పలువురిని ఆకర్షిస్తోంది. ఫాంటసీ క్రికెట్ గేమ్ లో ఈ సుడిగాడికి జాక్ పాట్ సొంతమైంది. బిహార్ లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్ ఒక గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ గా పని చేస్తుంటాడు. క్రికెట్ మీద ఇతడికి ఆసక్తి ఎక్కువ. జనవరి 14న భారత్ - అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ సందర్భంగా ఒక యాప్ (ఉద్దేశపూర్వకంగానే పేరు ఇక్కడ వెల్లడించటం లేదు) లో ఫాంటసీ గేమ్ ఆడాడు.
ఇందుకోసం అతను రూ.49 మాత్రమే చెల్లించాడు. అతడు ఆడిన గేమ్ లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. దీంతో అతడికి రూ.1.5కోట్ల భారీ మొత్తం ప్రైజ్ మనీగా లభించింది. దీంతో సాదిఖ్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అతడి జీవితమే మారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర స్పందిస్తూ.. సాదిఖ్ బ్యాంక్ ఖాతాకు డబ్బులు వచ్చినంతనే.. ఆ భారీ మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటివి పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటాయే తప్పించి.. మరో కారణమంటూ ఏమీ ఉండదు. అందుకే.. ఇలాంటి ఆసక్తికర సమాచారాన్ని చదవాలే తప్పించి.. ఇలానే ప్రయత్నించాలన్న ఆలోచన రాకూడదు. వస్తే.. చేతిలో డబ్బులు చేజారిపోవటం ఖాయం.