Begin typing your search above and press return to search.

టూర్ ప్లాన్ చేస్తున్నారా? బుకింగ్ విషయంలో జరజాగ్రత్త

టూర్లకు వెళ్లటం ఓకే అయినా.. ఇలాంటి వేళలో ప్యాకేజీల కోసం.. రాయితీల కోసం పెద్ద ఎత్తున వెతకటం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 7:30 AM
టూర్ ప్లాన్ చేస్తున్నారా? బుకింగ్ విషయంలో జరజాగ్రత్త
X

గతానికి వర్తమానానికి మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో కాస్త సెలవులు వచ్చాయంటే చాలు.. ఇంటి పని చూసుకోవటం.. విశ్రాంతి తీసుకోవటం.. స్నేహితుల్ని కలవటం చేస్తుండేవారు. ఇప్పుడు సీన్ మారింది. కాస్తంత సెలవులు వస్తే చాలు.. ఏదో ఒక ప్లేస్ కు వెళ్లిపోవటం అలవాటుగా మారింది. నెలలో కనీసం రెండు వీకెండ్లు అయినా చిన్న ట్రిప్పులకు వెళ్లటం.. లాంగ్ వీకెండ్ వస్తే మాత్రం పక్కాగా బయటకు వెళ్లే ప్లాన్లు ఎక్కువ అయ్యాయి. కరోనా పుణ్యమా అని ఇలా వెళ్లే అలవాటు మరింత ఎక్కువై.. ఇదో ట్రెండ్ గా మారింది.

టూర్లకు వెళ్లటం ఓకే అయినా.. ఇలాంటి వేళలో ప్యాకేజీల కోసం.. రాయితీల కోసం పెద్ద ఎత్తున వెతకటం చేస్తున్నారు. ఈ బలహీనతను అసరా చేసుకున్నకొన్ని నకిలీ వెబ్ సైట్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నాయి. పర్యాటకులకు వసతి సౌకర్యాన్ని అందించే అగ్రిగేటర్ సంస్థగా ప్రపంచంలోనే పేరున్న ఎయిర్ బీఎన్ బీ సంస్థ ఇటీవల ఒక సర్వే చేపట్టింది. జూన్ లో ఐదు రోజుల పాటు ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ సర్వే సమాచారాన్ని వెల్లడించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

మోసపూరిత ఆఫర్ల వలలో చిక్కుకొని మోసపోతున్న విషయాన్ని ఈ సర్వే వెల్లడించింది. జీవన వ్యయం పెరగటంతో ఖర్చు తగ్గించుకోవటానికి ఆఫర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా సురక్షితం కాని లింకుల బారిన పడి పెద్ద ఎత్తున మోసపోతున్న విషయాన్ని వెల్లడించింది. హాలీడే బుకింగ్స్ సమయంలో సగటున రూ.1.02 లక్షలు కోల్పోతున్న వైనాన్ని యాత్రికులు వెల్లడించారు.

సాధ్యం కాని ఆఫర్లు అని తెలిసినా.. ఏమో.. బంపర్ ఛాన్స్ కొట్టేశామన్న ఆశతో ప్రయత్నించి మోసపోతున్నట్లు చెబుతున్నారు. 40 శాతం కంటే ఎక్కువ మంది డబ్బును ఆదా చేయటానికి యథాలాపంగా మోసపూరిత లింకుల్ని నొక్కి సొమ్ములు పోగొట్టుకుంటున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా 2500 థర్డ్ పార్టీ ఫిషింగ్ డొమైన్స్ ఉన్న విషయాన్ని వెల్లడించారు. అందుకే.. ఏదైనా లింకును నొక్కే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

ఆగస్టుతో మొదలయ్యే యాత్రా సీజన్.. వచ్చే జనవరి వరకు సాగటం తెలిసిందే.ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవటం.. విశ్వసనీయ వెబ్ సైట్లలో బుకింగ్ లు చేసుకోవటం మంచిదంటున్నారు. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్ కూడా పేర్కొన్నారు. తెలియని వ్యక్తులు.. సంస్థల నుంచి వచ్చే మొయిల్స్.. మెసేజ్ లలోని లింకుల్ని క్లిక్ చేయొద్దని పేర్కొన్నారు. ఆన్ లైన్ ఖాతాల కోసం ప్రత్యేక పాస్ వర్డులు అవసరమని.. కనీసం 12 అక్షరాలు.. అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. విశ్వసనీయ సంస్థల సైట్ నుంచి బుక్ చేసుుకోవటం ఉత్తమంగా పేర్కొన్నారు. ఆన్ లైన్ చెల్లింపులకు క్రెడిట్ కార్డులు వినియోగించటం ఉత్తమంగా పేర్కొటున్నారు. వీటిల్లో సెక్యూరిటీ వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. సో.. టూర్లకు ప్లాన్ చేసే వారంతా జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.