ఆన్ లైన్ గేమింగ్‌పై జీఎస్టీ... కేంద్రం వెర్షన్ ఇదే!
గత రెండు రోజులుగా ఆన్ లైన్ గేమింగ్ రంగంపై జీఎస్టీ అమలు వంటి విషయాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 3 Aug 2023 4:52 AM GMTగత రెండు రోజులుగా ఆన్ లైన్ గేమింగ్ రంగంపై జీఎస్టీ అమలు వంటి విషయాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమపై కేంద్రం జీఎస్టీ విధించింది. అయితే విధించిన జీఎస్టీని తగ్గించాలని ఇండియన్ గేమర్స్ యునైటెడ్ ఆర్థిక మంత్రిని కోరింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది.
అయితే తాజాగా ఈ విషయంలో తగ్గేదేలే అంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అవును... తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమ కోరింది. అధిక పన్ను భారం అనేది చట్టవిరుద్ధమైన గేమింగ్ సంస్థలను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడింది.
28 శాతం జీఎస్టీ అనేది ఎదుగుతున్న ఆన్ లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో గుర్రపు పందేలు, జూదం వంటి అదృష్టాన్ని పరీక్షించుకునే గేమ్ లను.. నైపుణ్యాలతో కూడిన గేమ్ లను ఒకే గాటన కట్టొదంటూ విన్నవించింది
అయితే తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇందులో భాగంగా.. ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం జీఎస్టీ ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దీని అమలుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపిన ఆమె... అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరాల దృష్ట్యా.. 6 నెలల అనంతరం తిరిగి దీనిపై సమీక్ష నిర్వహించనున్నామని కేంద్ర ఆర్ధిక మాంత్రి తెలిపారు. అదేవిధంగా కొన్ని కంపెనీలకు కౌన్సిల్ కొంతమేర ఉపశమనం ఇచ్చింది.
కాగా... తమకు కొంత వెసులుబాటు కల్పించాలని గోవా, సిక్కిం రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలను పరిగణలోకి తీసుకునే విషయాలపై రానున్న 6 నెలల్లో నిబంధనలు అమలు, వాటి పర్యవసానాలపై తిరిగి రివ్యూ చేస్తాం అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.