Begin typing your search above and press return to search.

ముగ్గురు ఎంపీలలో మిగిలింది ఒక్కరేనా బాబూ...!?

గిర్రున అయిదేళ్ల కాలం తిరిగేసరికి ఈ ముగ్గురిలోనూ ఇద్దరిని టీడీపీ పోగొట్టుకుంది.

By:  Tupaki Desk   |   28 Jan 2024 7:22 PM GMT
ముగ్గురు ఎంపీలలో మిగిలింది ఒక్కరేనా బాబూ...!?
X

తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికలు చరిత్రలో చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఆ పార్టీ పుట్టాక ఇంతటి పరాభవం ఏ ఎన్నికల్లోనూ చవి చూడలేదు. కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి. వారే శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్. గిర్రున అయిదేళ్ల కాలం తిరిగేసరికి ఈ ముగ్గురిలోనూ ఇద్దరిని టీడీపీ పోగొట్టుకుంది.

ఒక విధంగా చూస్తే ఇది టీడీపీకి ఇబ్బంది కలిగించే విషయంగానే చూడాలని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని చంద్రబాబుని విమర్శిస్తూ వైసీపీలో చేరిపోయారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ టికెట్ కూడా ఇచ్చింది. దాంతో ఆయనను టీడీపీ దూరం చేసుకున్నట్లు అయింది.

ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 2019లో రెండవసారి గెలిచిన తరువాత మొదట్లో యాక్టివ్ గా ఉన్నా ఆ తరువాత పరిణామాల నేపధ్యంలో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆదివారం ఆయన గుంటూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రాజకీయాలకు తాను దూరం అంటూ ఒక సంచలన ప్రకటన చేశారు.

దాంతో ఆయన కూడా టీడీపీకి దూరం అయినట్లే. ఇక మిగిలింది కింజరాపు వారి వారసుడు రామ్మోహన్ నాయుడు మాత్రమే. ఇదిలా ఉంటే కేశినేని నాని విషయంలో పొమ్మనకుండా పొగబెట్టిన టీడీపీ అధినాయకత్వం గల్లా జయదేవ్ విషయంలో మాత్రం వైసీపీని నిందిస్తూ మాట్లాడడం విడ్డూరం అని అంటున్నారు. లోకేష్ కానీ చంద్రబాబు కానీ గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరం కావడానికి వైసీపీనే కారణం అని విమర్శించారు.

ఈ మేరకు లోకేష్ అయితే ట్వీట్ చేస్తే చంద్రబాబు రా కదలిరా అంటూ నిర్వహించిన నెల్లూరు సభలో వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో రాజకీయాలు చేసేవారు కూడా వదిలిపోతున్నారు అని ఆయన మండిపడ్డారు.

నిజానికి చూస్తే గల్లా జయదేవ్ ఈ రోజుకి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోలేదు. ఆయన రెండేళ్ళకు పైగా దూరంగా ఉంటున్నారు. ఆనాడు మాట్లాడని టీడీపీ నేతలు ఇపుడు వైసీపీ మీద వేలెత్తి చూపిస్తున్నారు అని అధికార పార్టీ అంటోంది. గల్లా జయదేవ్ అయితే పెదవి విప్పి వైసీపీ వేధింపుల వల్ల తాను రాజకీయాలకు దూరం అవుతున్నాను అని చెప్పలేదు అన్నది కూడా గుర్తు చేస్తున్నారు.

జయదేవ్ రాజకీయాల్లో మొదటి నుంచి లేరు. ఆయన 2019లో పోటీకే పెద్దగా ఆసక్తి చూపించలేదు అని వినిపించింది. సరే ఆయన ఏ కారణాల వల్ల రాజకీయాలకు గుడ్ బై కొట్టినా కేశినేని నాని విషయంలో టీడీపీ చేసింది ఏంటి అన్న ప్రశ్న వస్తోంది. జయదేవ్ రాజకీయాలను వదిలి వెళ్ళిపోయారు అంటున్న వారు రాజకీయాల్లో కొనసాగుతూ పోటీకి సిద్ధం అన్న కేశినేని నానిని ఎందుకు వదులుకున్నారు అన్న దానికి జవాబు పెదబాబు చినబాబే చెప్పాలని అంటున్నారు.

ఏది ఏమైనా ముగ్గురిలో ఇద్దరు ఎంపీలు టీడీపీకి ఈ అయిదేళ్లలో లేకపోవడం రాజకీయంగా బిగ్ ట్రబుల్ అంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల విషయం ఎలా ఉన్నా ఎంపీలు దొరకడం అన్ని పార్టీలకు సమస్యగా ఉంది. ఈ టైం లో గల్లా జయదేవ్ అయినా కేశినేని నాని అయినా టీడీపీకి దూరం కావడం అంటే సమస్య ఎక్కడ ఉందో లోతుగా ఆలోచించాలని అంటున్నారు. ఒకవేళ గల్లా జయదేవ్ అధికార పార్టీ వేధింపులకు జడిసి రాజకీయాల నుంచి దూరం అవుతూంటే ఆయనను నైతిక మద్దతు ఇచ్చి ఉంచాల్సిన బాధ్యతలో టీడీపీ విఫలం అయిందా అన్న చర్చ కూడా వస్తోంది.