ఐక్యరాజ్యసమితి అవార్డు అందుకున్నఏకైక సీఎం మృతి!
కేరళ మాజీ ముఖ్యమంత్రి
By: Tupaki Desk | 18 July 2023 4:55 AM GMTకేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు సమస్యతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అవును... రాజకీయ కురువృద్ధుడిగా, కాంగ్రెస్ పార్టీలో విశ్వాసపాత్రుడిగా పేరొందిన ఊమెన్ చాందీ మరణించారు. ఈయన మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా.. ఆయన ఇకలేరన్న వార్తతో వీరాభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారని తెలుస్తుంది. ఇదేసమయంలో అభిమాన నాయకుడ్ని చివరి చూపు చూడటానికి చారిటీ ఆస్పత్రికి అభిమానులు, నేతలు తరలివస్తున్నారని అంటున్నారు.
కాగా.. 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు ఊమెన్ చాందీ. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఊమెన్ చాందీ అంచెలంచెలుగా ఎదిగారు. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తిత్వంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సన్నిహితుడిగా మారారు.
1970లో కేరళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన చాందీ.. అదే ఏడాది తనకు 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అది మొదలు ఆయన రజకీయ విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. అదే నియోజకవర్గానికి ఏకంగా 12 సార్లు ఆయన ఎమ్మెల్యేగా సేవలందించారు.
1977లో కె.కరుణాకరన్ కేబినెట్ లో తొలిసారిగా మంత్రి పదవి దక్కించుకున్న చాందీ... అనంతరం ఏకే ఆంటోని హయాంలో ఆర్థిక శాఖమంత్రిగా, హోం మంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2018 నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇదే క్రమంలో... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత 2018లో ఏపీ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు.
ఇక కేరళ రాష్ట్రానికి రెండు దఫాలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు చాందీ. అవును... 2004 నుంచి 2006 వరకు ఒకసారి.. 2011 నుంచి 2016 వరకు రెండోసారి చాందీ కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదే సమయంలో నాలుగుసార్లు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో 2022లో... 18,728 రోజుల పాటు సభలో పుత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యుడిగా రికార్డు సాధించారు. ఈ రికార్డు అంతకముందు కేరళ కాంగ్రెస్ (ఎం) మాజీ అగ్రనేత దివంగత కేఎం మణి పేరుమీద ఉండేది.
ప్రజాసేవకు గానూ ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు అందుకున్న ఏకైక భారతీయ సీఎం చాందీనే కావడం విశేషం అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏనాడూ పార్టీ మారలేదు!