ఏఐ విజిల్ బ్లోయర్ సూసైడ్.. డౌట్లు పెంచిన మస్క్ ట్వీట్
ఇప్పుడు మస్క్ ఓ అంశమై ట్వీట్ పెట్టారు. అది కూడా భారత సంతతికి చెందిన యువకుడి ఆత్మహత్య గురించి కావడం గమనార్హం. అదిప్పుడు పెద్ద సంచలనంగా మారింది
By: Tupaki Desk | 14 Dec 2024 8:48 AM GMTటెక్నాలజీ అంటే ఎలాన్ మస్క్.. మస్క్ అంటే టెక్నాలజీ.. అలాంటి మస్క్ ఓ అంశంపై ట్వీట్ చేశారంటే.. అది సంచలనమే.. అన్నట్లు ట్విటర్ ను మస్క్ కొనుక్కుని దాని పేరున ‘ఎక్స్’గా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో ట్విటర్ కు మరింత ప్రాపగాండా వచ్చింది. ఇప్పుడు మస్క్ ఓ అంశమై ట్వీట్ పెట్టారు. అది కూడా భారత సంతతికి చెందిన యువకుడి ఆత్మహత్య గురించి కావడం గమనార్హం. అదిప్పుడు పెద్ద సంచలనంగా మారింది.
ఇంతకూ ఏమైందంటే?
చాట్ జీపీటీ మదర్ కంపెనీ ఓపెన్ ఏఐ అనే సంగతి తెలిసిందే. ఈ ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) సుచిర్ బాలాజీ. వయసు కేవలం 26 ఏళ్లే. అయితే, భారత సంతతికి చెందిన ఇతడు శాన్ ఫ్రాన్సిస్కోలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అది కూడా తన సొంత ఇంట్లో. వాస్తవానికి గత నెల 26నే సుచిర్ మరణించాడు. కానీ, చాలా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లభ్యం కాలేదని కూడా తెలిపారు.
బాలాజీని చంపేశారా?
ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరం అంటూ గతంలో బాలాజీ పరిశోధనలో వెల్లడించాడు. ఆ సంస్థ కాపీ రైట్ల ఉల్లంఘనలకు పాల్పడుతోందని కూడా ఆరోపించారు. సరిగ్గా ఆ తర్వాత మూడు నెలలకు బాలాజీ మృతి చెందినట్లు స్పష్టం అవుతోంది. దీంతో తీవ్ర చర్చనీయమైంది. బాలాజీ ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. అతడు 2020 నవంబరు నుంచి 2024 ఆగస్టు వరకు అందులో విధులు నిర్వర్తించాడు. ప్రజలకు మేలు కంటే కీడు ఎక్కువగా చేసే సాంకేతికతల కోసం ఇక తాను ఏమాత్రం పని చేయదల్చుకోలేదని అన్నాడు. అందుకే ఓపెన్ ఏఐను వీడినట్లు చెప్పాడు.
ఇప్పుడు మస్క్ ట్వీట్ తో సంచలనం
సుచిర్ మరణమే సంచలనం అనుకుంటే.. దీనిపై అపర కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ మరింత సంచలనం రేపుతంది. అది కూడా కేవలం ‘హిమ్’ అంటూ మస్క్ స్పందించడం గమనార్హం.