Begin typing your search above and press return to search.

గుంటూరులో మరో అవేక్ సర్జరీ... ఈసారి అయోధ్య వీడియో!

ఈ క్రమంలో అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఫుల్ వీడియో చూపిస్తూ సదరు రోగికి వైద్యులు ఆపరేషన్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 6:02 AM GMT
గుంటూరులో  మరో అవేక్  సర్జరీ... ఈసారి అయోధ్య వీడియో!
X

పెద్ద స్థాయి ఆపరేషన్ లలో సైతం పేషెంట్ కు పూర్తి మత్తు ఇవ్వకుండా.. వారు మెలకువగా ఉండగానే ఓపెన్‌ బ్రెయిన్‌ సర్జరీలు చేయడం ఇటీవల పరిపాటిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పెషెంట్‌ కు ఇష్టమైన "పోకిరీ" సినిమా చూపిస్తూ.. బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు.. ఈ క్రమంలో మరోసారి రోగికి వీడియో చూపిస్తూ.. అతడు స్పృహలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేశారు.

అవును... గుంటూరు టౌన్ లోని అరండల్ పేటలోని ఒక ఆస్పత్రిలో తాజాగా ఒక ఆపరేషన్ జరిగింది. ఇందులో భాగంగా...రోగికి వీడియోలు చూపిస్తూ వైద్యులు ఆపరేషన్లు చేశారు. రోగి శ్రీరాముడి భక్తుడు కావడంతో... అతని కోసం ఆపరేషన్‌ థియేటర్‌ లో ల్యాప్‌ ట్యాప్ లో అయోధ్య రాముడి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఈ సమయంలో ఆ వ్యక్తి భక్తి పారవశ్యంలో వీడియో తిలకిస్తుండగా వైద్యులు ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు.

వివరాళ్లోకి వెళ్తే... గుంటూరు అరండల్ పేటలోని ఆసుపత్రిలో మణికంఠ అనే వ్యక్తికి మెదడు ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఫుల్ వీడియో చూపిస్తూ సదరు రోగికి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో మణికంఠకు దైవభక్తి ఎక్కువగా ఉందని తెలుసుకున్న వైద్యులు ఈ విధంగా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఆ వీడియో చూస్తున్న రోగి మణికంఠ ఆపరేషన్ మధ్యలోనే "జై శ్రీరాం" అన్నారని వైద్యులు చెబుతున్నారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన వ్యక్తి మణికంఠ.. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి మెదడులో సుమారు 7 సెంటీ మీటర్ల పరిమాణంలో కణతి ఏర్పడింది. అయితే... మత్తు ఇచ్చి మెదడుకు ఆపరేషన్ చేస్తే చెయ్యి, కాలు పడిపోయే అవకాశం ఉన్నదని.. అందువల్ల అతడు మత్తు లేదా నిద్రలోకి జారుకోనివ్వకుండా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు!

ఈ మేరకు ఈ నెల 11న ఆపరేషన్‌ ను మొదలుపెట్టి సక్సెస్ ఫుల్ గా ముగించిన వైద్యులు... సదరు రోగి కోలుకోవడంతో తాజాగా డిశ్చార్జి చేశారు. కాగా... వైద్యులు రోగితో మాట్లాడుతూ డాక్టర్లు చెప్పిన విధంగా కాలు చేయి కదుపుతుండగానే మెదడులోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగలకుండా శస్త్ర చికిత్స చేస్తుంటారు. దీన్ని అవేక్ సర్జరీ అని వైద్య పరిభాషలో అంటారు!!