Begin typing your search above and press return to search.

అంజాద్ పై తేజస్విని ఏం చెప్పింది? జమ్ము ఆపరేషన్ పూర్తి ఇలా!

అంజాద్.. తేజస్విని నుంచి వివరాలు సేకరించటంతో పాటు.. పోలీసులు చేపట్టిన ఆపరేషన్ జమ్మును చూస్తే.. పలు ఆసక్తికర అంశాలు వెలుగు చేశాయి.

By:  Tupaki Desk   |   4 July 2024 5:31 AM GMT
అంజాద్ పై తేజస్విని ఏం చెప్పింది? జమ్ము ఆపరేషన్ పూర్తి ఇలా!
X

తన కుమార్తె 9 నెలలుగా కనిపించకుండా పోయిందంటూ భీమవరానికి చెందిన ఒక మహిళ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి తన వేదనను చెప్పుకోవటం.. తక్షణమే స్పందించిన పవన్.. పోలీసులకు ఈ విషయంపై ఫోకస్ చేయాలని ఆదేశించటం తెలిసిందే. కట్ చేస్తే.. పది రోజుల్లోనే 9 నెలలుగా ఆచూకీ లేకుండా పోయిన తేజస్విని ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తించటంతో పాటు.. ఆమెను.. ఆమెను తీసుకెళ్లిన అంజాద్ ను విజయవాడకు తీసుకొచ్చారు.

ఆపరేషన్ జమ్ము పేరుతో రెండు గంటల వ్యవధిలోనే పూర్తి చేసినట్లు చెబుతున్నారు. జమ్మూ నుంచి విజయవాడకు బుధవారం తెల్లవారుజామున తీసుకొచ్చిన అనంతరం.. పోలీసులు వారిద్దరిని విచారణ చేశారు. ఈ సందర్భంగా తేజస్విని వాంగ్మూలాన్ని రికార్డు చేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను విజయవాడ నుంచి గత ఏడాది అక్టోబరు 28న అంజాద్ బలవంతంగా తీసుకెళ్లినట్లుగా తేజస్విని చెప్పింది. తొమ్మిది నెలల్లో తనను ఎక్కడా ఇతరులతో ఫోన్ లో మాట్లాడనీయలేదని.. తాము చాలా చోట్ల తిరిగినట్లుగా ఆమె చెప్పింది.

చివరకు జమ్ములో దిగినట్లుగా చెప్పిన ఆమె.. తనను ఒక గదిలో ఉంచాడని.. అక్కడి భాష రాకపోవటంతో తాను ఎక్కడికీ వెళ్లలేకపోయినట్లుగా చెప్పింది. తేజస్విని స్టేట్ మెంట్ ఆధారంగా అంజాద్ పై అక్రమంగా బంధించటం.. పెళ్లి చేసుకుంటానని బలవంతంగా తీసుకెళ్లటం.. దాడి చేయటం.. బంధించటంలాంటి నేరాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తేజస్విని ఆమె తల్లికి అప్పజెప్పారు. నిందితుడు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

అంజాద్.. తేజస్విని నుంచి వివరాలు సేకరించటంతో పాటు.. పోలీసులు చేపట్టిన ఆపరేషన్ జమ్మును చూస్తే.. పలు ఆసక్తికర అంశాలు వెలుగు చేశాయి. గత ఏడాది నవంబరులో విజయవాడ నుంచి వెళ్లిన తర్వాత హైదరాబాద్, కేరళ, ముంబయి, రాజస్థాన్ లకు వెళ్లిన వారు ఆ తర్వాత ఢిల్లీ నుంచి జమ్ముతావి ట్రైన్ లో జమ్ముకు చేరారు. అక్కడ ఒక హోటల్ కు వెళ్లిన అంజాద్.. తామిద్దరం ప్రేమికులమని.. ఇంట్లో పెద్దలకు చెప్పకుండా పారిపోయి వచ్చినట్లుగా చెప్పి.. నెలకు రూ.7500 జీతానికి ఒక హోటల్లో పనికి కుదిరాడు. జీతంతో పాటు వసతి ఇవ్వటంతో.. ఆ రూంలో తేజస్విని ఉంచేశాడు. జీతంతో వచ్చిన డబ్బులతో మార్చిలో ఫోన్ కొన్నాడు. అయితే.. తేజస్వినికి మాత్రం ఫోన్ ఇచ్చేవాడు కాదు.

ఇదిలా ఉంటే.. తాజాగా వేరే వారి ఫోన్ ద్వారా తేజస్విని తన సోదరికి ఇన్ స్టాలో తన గురించి మెసేజ్ పెట్టింది. ఆ టైంలో అంజాద్ రూంలో లేడు. సోమవారం సాయంత్రం 4.30 గంటల వేళలో మెసేజ్ చేయగా.. తేజస్విని సోదరి వెంటనే విజయవాడ పోలీసులకు ఆ సమాచారాన్ని అందించారు. సాయంత్రం 5 గంటల సమయానికి తేజస్విని ఉన్న లొకేషన్ మీద పోలీసులకు అవగాహన వచ్చింది. వెంటనే జమ్ము పోలీసులకు వివరాలను పంపారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి.. అక్కడకు వెళ్లారు.

కాసేపటికే వీరిద్దరిని తమ అదుపులోకితీసుకొని జమ్మూలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. 7 గంటల సమయానికి వీరిద్దరి ఫోటోల్ని విజయవాడకు పంపటం.. వారిద్దరిని కన్ఫర్మ్ చేయటంతో ఆపరేషన్ జమ్ము పూర్తైంది. దీంతో.. ఏపీ నుంచి ఇద్దరు పోలీసులు జమ్ముకు వెళ్లి.. ఇద్దరిని విమానంలో బుధవారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. తేజస్విని ఆమె తల్లికి అప్పజెప్పగా.. అంజాద్ ను పోలీసులు అదుపులో ఉంచారు.