కేసీఆర్‌కు ఆపరేషన్ ప్రారంభం: నెటిజన్ల రియాక్షన్ ఇదే!
కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించే ముందు ఆయనను చూసేందుకు బీఆర్ ఎస్ నేతలు, మాజీ మంత్రులు.. జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
By: Tupaki Desk | 8 Dec 2023 4:38 PM GMTబీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ప్రారంభమైంది. సోమాజిగూడలోని ప్రముఖ యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. శస్త్ర చికిత్సకు దాదాపు 2 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించే ముందు ఆయనను చూసేందుకు బీఆర్ ఎస్ నేతలు, మాజీ మంత్రులు.. జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
కాగా, కేసీఆర్‌ను ఆసుపత్రిలో ఆపరేషన్ ధియేటర్‌కు తరలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్ట్రేచర్‌పై పడుకున్న ఆయనపై గ్రీన్‌కలర్ దుపట్టా కప్పారు. ముఖం అంతా నీరసంగా ఉంది. పక్కన వైద్యులు ఉన్నారు. ఈ ఫొటోలు వీక్షించిన నెటిజన్లు.. కేసీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పోస్టులు చేశారు. ఇదిలావుంటే.. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ ఎస్ ఓడిపోయిన దరిమిలా.. ప్రభుత్వం దిగిపోయింది.
ఈ క్రమంలో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. గురువారం రాత్రి వాష్ రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే జారి పడ్డారు. దీంతో శుక్రవారం వేకువ జామున ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక పరీక్షల అనంతరం..తుంటి ఎముకలు విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఇప్పుడు శస్త్ర చికిత్సకు సిద్ధమయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షిస్తోంది. ఆసుపత్రి వద్ద భారీ భద్రతను కల్పించారు.