వలంటీర్ల పై ఏపీ ప్రతిపక్షాల బాధలు అన్నీ ఇన్నీ కాదుగా..!
రాష్ట్రం లో వలంటీర్ల వ్యవస్థ పై విపక్షాలు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 25 July 2023 2:45 AM GMTరాష్ట్రం లో వలంటీర్ల వ్యవస్థ పై విపక్షాలు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ప్రజల వైపు నుంచి ఆలోచించినప్పుడు.. జనసేన నుంచి కమ్యూనిస్టుల వరకు వారు చెబుతున్నది సరైనదే అయితే.. అందరూ ఆందోళన చెందాల్సిందే. ప్రజల వ్యక్తిగత గోప్యతకు, వారి హక్కులకు నిజంగానే వలంటీర్లు గండి కొడుతున్నప్పుడు.. ఖచ్చితంగా అందరూ ఆ దిశగా నిలబడాల్సిందే.
అయితే.. ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పార్టీలు.. ఇప్పటికిప్పుడు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తే.. దీనికి ప్రత్యామ్నాయం కూడా చూపించాలి కదా! అనేది సామాన్యుల ప్రశ్న. ఇదే విషయం ఆయా పార్టీల నేతల మధ్య కూడా అంతర్గత సంభాషణల్లో వ్యక్తమవుతోంది. ఎన్ని విమర్శలు ఉన్నా.. ఎన్ని ఆందోళనలు ఉన్నా.. వలంటీర్ వ్యవస్థకు సంబంధించి కీలకమైన విషయాల్లో ప్రజల మద్దతు ఉందనేది ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు.. ఇంటి నుంచి కాలు బయట కు పెట్టకుండానే.. నెలనెలా 1నే పింఛను అందిస్తున్న మాట ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయలేని స్థితిలో సాగుతోంది. సో.. దీనికి ప్రజలు కూడా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థను తీసేస్తే.. ఇంటింటికీ వెళ్లి ప్రజల కు పింఛన్లు అందించే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏదైనా ఉందా?
ఇక, ప్రభుత్వ పథకాల కు సంబంధించి ప్రజలకు సమాచారం చేరవేయడంలోనూ..దరఖాస్తు చేసుకోవడం లోనూ సహకరిస్తున్న వలంటీర్ల వ్యవస్థను ఇప్పుడు తొలగించేస్తే.. ప్రజలకు ఆ సమాచారం చేరవేసే వ్యవస్థ ఏదైనా ఉంటుందా? అదేవిధంగా ప్రజల కు ఇతర సమస్యలు వచ్చినప్పుడు కూడా.. నేరుగా వలంటీర్లకే ఫోన్లు వెళ్తున్నాయి. పవర్ కట్ నుంచి రేషన్ వరకు.. అనేక విషయాల్లో ప్రజల కు వారు కనెక్ట్ అయిపోయారు. ఎంతగా అంటే.. నాయకుల కంటే కూడా.. వలంటీర్లకు ప్రజలు బంధువులుగా మారిపోయారు.
సో ఇలాంటి వ్యవస్థలో తప్పులు ఉన్నాయని.. లోపాలు ఉన్నాయని .. కొన్నాళ్లుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. దీని ని ఇప్పుడు జనసేన తర్వాత.. ఒక్కొక్క పార్టీ కూడా ప్రచారంలోకి తెచ్చాయి. మరి ఇలాంటి వ్యవస్థను తీసేయాల ని అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం ఉందా? అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. ఇదే విషయం పై ఇప్పుడు అన్ని విపక్ష పార్టీలు కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.