అటు ఆహా.. ఓహో.. ఇటు ఎలక్షన్ లాలీపాప్: బడ్జెట్ చిత్రాలు
కట్ చేస్తే.. ప్రతిపక్షం ఏమంటోంది? అనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తుంది. ఎందుకంటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గళం ప్రజల అభిప్రాయానికి ప్రాతిపదికగా నిలుస్తుంది కాబట్టి.
By: Tupaki Desk | 1 Feb 2024 1:07 PM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌పై అధికార పక్షం.. సభ్యులు.. మిత్రపక్ష పార్టీలు.. 'ఆహా.. ఓహో' అంటున్నారు. ఇంతటి సమున్నతమైన బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి.. ఇది మోడీసర్కారు కాబట్టి.. ఆయన ఉన్నారు కాబట్టి.. సాధ్యమైంది.. కాబట్టి.. అంటూ.. దీర్ఘాలు తీసే నాయకులు కూడా బయలు దేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీ మిత్రత్వం కోసం పాకులాడు తున్న కొన్ని పార్టీలు.. కూడా మోడీ భజన ప్రారంభించారు. ఊరూవాడా.. ఈ బడ్జెట్ బాగుందని ప్రచారం చేస్తున్నారు.
కట్ చేస్తే.. ప్రతిపక్షం ఏమంటోంది? అనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తుంది. ఎందుకంటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గళం ప్రజల అభిప్రాయానికి ప్రాతిపదికగా నిలుస్తుంది కాబట్టి. ఇలా చూసినప్పుడు.. మెజారిటీ పార్టీలు.. "ఇంటీరియమ్ బడ్జెట్.. ఈజ్ నథింగ్ బట్.. ఎలక్షన్ లాలీపాప్" అని వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షాల వ్యాఖ్యలు.. అచ్చం ప్రజల నాడిని ప్రతిబింబించ కపోయినా.. వారి అభిప్రాయం దాదాపు దానికి సమాంతరంగా ఉండడం గమనార్హం.
+ "బడ్జెట్‌లో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి వాగ్దానాలు కనిపించడం లేదు. వచ్చే పూర్తి బడ్జెట్ కోసం మేం ఎదురుచూస్తున్నాం. అయితే దానిని 'ఇండియా' కూటమి సమర్పిస్తుంది"- డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ
+ "ఇదొక వేస్ట్ బడ్జెట్. దేశంలో పేదలు పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను పరిష్కరించేందుకు బడ్జెట్ ప్రయత్నించడం లేదు" - కేరళ సీఎం పినరయి విజయన్.
+ "ఇది కూడా ఒక బడ్జెట్టా. మోడీని కీర్తించేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సమావేశం. ఇందులో పసేముంది? దేశాన్ని పట్టిపీడిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఏదైనా ప్రయత్నం ఉందా? విదేశీ రుణాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ప్రస్తావించారా. ఇదొక చెత్త బడ్జెట్" - ఎంపీ ప్రమోద్ తివారీ(కాంగ్రెస్)
+ "ఇది ఎన్నికలకు ముందు.. ప్రజలకు మోడీ ఇచ్చిన లాలీపాప్. దేశంలో ధరలు పెరిగి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. కూలివాళ్లు బతకలేని పరస్థితిలో ఉన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటికి పరిష్కారం చూపించారా. లాలీపాప్ ఇచ్చి.. చీక్కోమన్నారు" - నీలభ్ కుమార్ శుక్లా, కాంగ్రెస్ నేత
+ "2047 నాటికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉంది. బడ్జెట్ నిర్ణయాలు ఆ లక్ష్యసాధన దిశగా ఉన్నాయి.. మౌలిక రంగానికి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామం. ఈ బడ్జెట్ చాలా బాగుంది" - ఏపీ టీడీపీ