కోటి మంది కస్టమర్లు... ఇంటర్నెట్, మొబైల్ సర్వీస్ ఆగిపోయాయి!
ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం, ఆదేశ రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన "ఆప్టస్" లో తీవ్ర సాంకేతిక సమస్య ఎదురైంది.
By: Tupaki Desk | 8 Nov 2023 10:48 AM GMTసాధారణంగా వరదలు, భారీ వర్షాలు, తుఫానులూ, భూకంపాలు, అగ్నిపర్వతం పేళడం, అడవులు దహించుకుపోవడం మొదలైన వాటిని ప్రకృతి విపత్తులు అంటారు. ఈ టెక్నాలజీ కాలంలో ఇంటర్నెట్ ఆగిపోవడం, మొబైల్ సర్వీసులు నిలిచిపోవడం కూడా అతిపెద్ద విపత్తుగానే పరిగణించాల్సిన పరిస్థితి. ఇలాంటి విపత్తు తాజాగా ఆస్ట్రేలియాలో సంభవించింది. దీంతో లక్షల మంది కష్టాలు వర్ణనాతీతం!
అవును... ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం, ఆదేశ రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన "ఆప్టస్" లో తీవ్ర సాంకేతిక సమస్య ఎదురైంది. ఇలా సుమారు కోటిమంది కస్టమర్లు ఉన్న టెలికాం సంస్థలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చే సరికి లక్షల మందికి ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ పోర్ట్, పేమేంట్ సిస్టం, మెడికల్ వ్యవస్థల్లో సమస్యలు మొదలయ్యాయి. అయితే ఈ సంకేతిక సమస్యకు కారణం ఏంటనేది మాత్రం ఆప్టస్ వెల్లడించలేదు.
ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఆప్టస్... వందల కంపెనీలతో వ్యాపారం చేస్తోంది. ఇదే సమయంలో ఈ ఆప్టస్ నెట్ వర్క్ పై ఆధారపడిన అమైసిమ్, ఆసీ బ్రాడ్ బ్యాండ్, మూసే మొబైల్స్ వంటి ఇతర సర్వీసు ప్రొవైడర్లు కూడా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి.
ఇలా ఆప్టస్ కి సమస్యలు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఈ సంస్థకు చెందిన డేటా లీకైన వ్యవహారం ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ గా ఆప్టస్ డేటా లీక్ సంఘటన నిలిచింది. అయితే... దీనికి సైబర్ దాడే కారణమని అనుమానించారు కానీ... తాజా సమస్యకు మాత్రం అలాంటి సంకేతాలేవీ లేవని తెలుస్తుంది.
ఆ సంగతి అలా ఉంటే... ఆప్టస్ లో సోమవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యను గుర్తించారని తెలుస్తుంది. అయితే ఆ సమస్యను గుర్తించిన సుమారు ఏడుగంటల తర్వాత కంపెనీ సీఈవో కెల్లీ బాయర్ రోస్మరిన్ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ఇందులో భాగంగా సమస్య ఏమిటో అర్థం కావడంలేదని ఆయన వెల్లడించడం గమనార్హం.
ఇదే సమయంలో... తమ టెక్నికల్ టీంస్ సమస్య పరిష్కరించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని.. సర్వీసును బ్యాకప్ చేసేవరకూ వారంతా అవిశ్రాంతగా పనిచేస్తారని కెల్లీ బాయర్ తెలిపారు. ఇదే క్రమంలో... ఆస్ట్రేలియా కమ్యూనికేషన్ మంత్రి మిచెల్ రాల్యాండ్ స్పందించారు... ఈ సమస్యపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని.. అందువల్ల ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వాలని కంపెనీని కోరుతున్నట్లు పేర్కొన్నారు!