Begin typing your search above and press return to search.

ఓవర్ కాన్ఫిడెన్స్ లో టీడీపీ కూటమి...!

తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టింది. అంటే మూడు పార్టీలు గత సక్సెస్ ట్రాక్ ని గుర్తు తెచ్చుకుని మరీ ఈ జట్టు కట్టారు అన్న మాట.

By:  Tupaki Desk   |   25 March 2024 7:46 AM GMT
ఓవర్ కాన్ఫిడెన్స్ లో టీడీపీ కూటమి...!
X

తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టింది. అంటే మూడు పార్టీలు గత సక్సెస్ ట్రాక్ ని గుర్తు తెచ్చుకుని మరీ ఈ జట్టు కట్టారు అన్న మాట. గత విజయాన్ని మరోసారి రిపీట్ చేయాలన్నదే ఈ కూటమి కట్టిన వారి పట్టుదల. దీని వెనక ఉన్న వ్యూహం కూడా పెద్దగా ఏమీ ఉండదు. రెండు ప్లస్ రెండు నాలుగు అవుతుంది అన్న సాధారణ గణితాన్ని రాజకీయ గణితానికి అప్లై చేయడానికే అన్నది కూడా కనిపిస్తున్న వాస్తవం.

అయితే అన్ని రోజులు ఒకటే ఉండవు. అలాగే అన్ని సార్లు ఒక్కటే విజయం రిపీట్ కాదు. కాల మాన పరిస్థితులు రాజకీయాలను ఎపుడూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. రాజకీయం అంటే నిరంతరం ప్రవహించే నది లాంటిది. అందువల్ల పదేళ్ల క్రితం నాటి పరిణామాలను కొనసాగించాలని ఆశించడంలో తప్పు లేదు కానీ అలాగే జరుగుతుంది అనుకోవడంలోనే తప్పు ఉంటుంది అన్నది ఒక కఠినమైన విశ్లేషణ.

ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు టీడీపీ కూటమిలో అనేకం కనిపిస్తాయి. అయితే కూటమికి ధైర్యాన్ని ఇస్తున్న విషయాలు చూస్తే కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో జట్టు కట్టడం. ఆ బీజేపీ కూడా ఏమీ వట్టి పోవడం లేదు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి కచ్చితంగా రాబోతోంది అన్న బలమైన సంకేతాలు ఉన్నాయి.

అంతే కాదు ఇటీవల కాలంలో రామ మందిరం నిర్మాణంతో మోడీ ఇమేజ్ అమాంతం పెరిగింది. అదే విధంగా ప్రపంచ నాయకుడిగా మోడీ కనిపిస్తున్నారు. దాంతో అర్బన్ సెక్షన్ ఆయన పట్ల ఆకర్షితులు అవుతున్నారు అని అంటున్నారు. అది కూటమికి శ్రీరామ రక్ష అని భావిస్తున్నారు.

అదే విధంగా గతసారి ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లు చూస్తే కనుక కాపుల నుంచి చాలా ఉన్నాయి. ఈసారి అలా జరగడం లేదు అన్నది మరో ధీమా. దానికి కారణం పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనను తమతో జట్టు కట్టి ఉంచుకున్నామని ఆత్మ విశ్వాసం. అంతే కాదు జనసేన కలయికతో ఓట్ల చీలిక రాదు అన్నది ఇంకో భరోసా.

వీటికి తోడు అన్నట్లుగా టీడీపీకి అనుకూలంగా కొన్ని సర్వేలు వస్తున్నాయి. ఈ సర్వేలు అన్నీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. దాంతో కూడా చాలా మటుకు నిబ్బరం పెరుగుతోందిట. అయితే ఇవన్నీ కూడా కూటమిని గెలిపించేస్తాయా అన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్న.

ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయం అంటేనే నిరంతర కదలికలతో కూడుకున్న వ్యవస్థ. క్షణ క్షణానికి అంతా మారుతున్న పరిస్థితి ఉంటుంది. అంటువంటి చోట రాజకీయంలో ఇలాగే జరుగుతుంది అంతా ఇలాగే ఉంటుంది అని అనుకోవడం అంటే అది అతి ధీమా అవుతుంది. అంతే కాదు దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అంటారు.

అయితే ఈ అతి ధీమాతో మరచిపోతున్న విషయాలు చాలానే ఉన్నాయి అంటున్నారు. అసలు వ్యవహారం అన్నది ఓట్ల బదిలీ మీదనే ఆధారపడి ఉంటుంది. జనసేన ఓట్లు టీడీపీకి అలాగే టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ కావాల్సి ఉంటుంది.

ఇది చాలా కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ. పార్టీల మద్దతుదారులు వేరే పార్టీలకు చుట్టాలే అవుతారు తప్ప రక్త బంధాలు కలవవు. పైగా తమకు ఎక్కడైనా అన్యాయం జరిగింది అన్న బాధ ఉన్నా ఆ నొప్పి ఉన్నా తీర్చేసుకోవడానికే చూస్తారు. సో ఆ విధంగా ఓట్ల బదిలీ జరగాల్సి ఉంటుంది. అపుడే కూటమికి కొండంత బలంగా ఉంటుంది.

ఇక వైసీపీని పోల్ మేనేజ్మెంట్ చేయనివ్వకుండా బీజేపీ కట్టడి చేస్తుందని మరో ధీమా కూడా ఉంది. కానీ అలాంటి పరిస్థితి పూర్తిగా ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. బీజేపీకి ఏపీలో సీట్లు కావాలి. అదే టైం లో చూస్తే ఏపీలో బీజేపీకి నేరుగా అధికారం దక్కడం లేదు. దాంతో వారు ప్రయారిటీలు వేరు. ఎంపీలే వారికి అవసరం.

ఇక ఎంపీలు అంటే కూటమి ఎంపీలు మాత్రమే కాదు, కూటమి అవతల ఉన్న వైసీపీ ఎంపీలు కూడా అవసరమే అని బీజేపీ భావించినపుడు గట్టిగా ఏపీలో బిగించేయడాలు అంటూ ఉండవు. ఈ లాజిక్ అర్ధం అయితే మాత్రం ఆ నమ్మకాలు కూడా ఎంతో కొంత సడలుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నది ఒక ముతక సామెత ఉంది. అలాగే కూటమి కట్టగానే విజయం సిద్ధంచదు అని చెప్పాల్సి ఉంటుంది.

ఏపీలో నాలుగు కోట్ల 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఎన్నిల్లో గెలుపునకు ఎన్నో చేయాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చూస్తే విజయానికి దగ్గర దారులు అయితే లేవు. సో కూటమి ఓవర్ గా రియాక్ట్ కాకుండా గ్రౌండ్ లెవెల్ లో కూడా రివ్యూస్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు.