బుల్లెట్ల వర్షం కురిపించండి.. భవనాల జోలికి రావొద్దు.. అక్బరుద్దీన్ ఎమోషన్
రోటీన్ కు భిన్నంగా ఈ చర్యలు సామాన్యుడి మీద కాకుండా బడా బాబుల మీదనే పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 26 Aug 2024 4:36 AM GMTప్రభుత్వం చేపట్టే చర్యలు.. సంస్కరణలు సామాన్యుడి మీదనే మొదలవుతాయి. వాడే నిత్యం బలి అవుతుంటాడు. బలహీనుడు చేసే తప్పునకు వేల రెట్లు బలిసినోడు చేస్తే పట్టని వ్యవస్థలపై సామాన్యులు తీవ్రమైన అసంత్రప్తితో ఉన్నారు. హైడ్రా పేరుతో.. రేవంత్ సర్కారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మీద ఫోకస్ చేసింది. ఈ మహానగరంలోని చెరువులు..కుంటల్ని అక్రమించుకొని పెద్ద ఎత్తున భవనాల్ని నిర్మించిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఈ చర్యలు సామాన్యుడి మీద కాకుండా బడా బాబుల మీదనే పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది.
చూస్తుండగానే.. ఏ రోజుకు ఆ రోజు బలమైన వ్యక్తులకు చెందిన ఆస్తుల మీదనే ఫోకస్ చేస్తోంది. తాజాగా ఎన్ కన్వెన్షన్ తో మరో సంచలనానికి తెర తీయగా.. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు సరే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్.. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఆస్తుల మాటేంటి? చెరువుల్లో నిర్మించిన వారి భారీ భవనాల్ని కూల్చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు.
మజ్లిస్ అధినేత కం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన మహిళా కాలేజీ సల్కం చెరువు అక్రమణలో ఉంటే.. ఓవైసీ ఆసుపత్రి.. రిసెర్చ్ సెంటర్ తదితరాలు డీఎంఆర్ చెరువులకు దగ్గర్లో ఉన్నాయన్న విషయాన్ని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన శాటిలైట్ ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఓవైసీ బ్రదర్స్ ఇద్దరూ ఆదివారం వేర్వేరు వేదికల మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అసుదుద్దీన్ ఓవైసీ ఒకలా రియాక్టు అయితే.. అక్బరుద్దీన్ ఓవైసీ మరోలా రియాక్టు కావటం గమనార్హం.
అసద్ విషయానికి వస్తే.. ‘‘కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా? నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది.. నెక్లెస్‌రోడ్‌ను కూడా తొలగిస్తారా?. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నాలాపై నిర్మించారు.. జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటి?. ప్రభుత్వ కార్యాలయాలు చాలా చోట్ల ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయి. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉంది. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారు. అక్కడికి వెళ్లి చూడండి.. లేదంటే నేను ఫోటోలు కావాలంటే నేను ఇస్తాను. ఎఫ్‌టీఎల్ సమస్యపై మేయర్‌ను కలిసి చెప్పాను.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తాను’ అంటూ పేర్కొన్నారు. అదే సమయంలో తమ ఆస్తుల గురించి ఆయన ప్రస్తావించలేదు.
అదే సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం తన సోదరుడికి కాస్తంత భిన్నంగా మాట్లాడటం గమనార్హం. ఆదివారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన.. సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న చర్చను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో 400 మంది మహిళలు. యువతులకు కట్లు.. మెహందీ.. ఎంబ్రాయిడరీ తదితర కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇచ్చారు. వీరి శిక్షణ పూర్తైన నేపథ్యంలో సర్టిఫికేట్లు జారీ చేస్తూ భావోద్వేగంతో మాట్లాడారు.
‘నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి. తల్వార్లు.. కత్తులతో దాడి చేయండి. కానీ.. విద్యావ్యాప్తికి నేను అంకితభావంతో చేస్తున్న ప్రయత్నానికి అడ్డుపడకండి. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు ఇప్పటివరకు 12 భవనాల్ని నిర్మించా. కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వీటిపై వక్రద్రష్టి పెట్టారు. గతంలో నాపై దాడి జరింది. కావాలంటే మరోసారి బుల్లెట్ల వర్షాన్ని కురిపించండి. అంతేకానీ పేదల విద్యాభివ్రద్ధికి నేను చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడొద్దు. విన్నపంగా చెబుతున్నానని బలహీనుడిగా భావించొద్దు. శత్రువులను ఓడించే శక్తి అపారంగా ఉంది. ఇలాంటి ఎత్తైయిన భవనాలను మరిన్ని నిర్మిస్తా’’ అంటూ వ్యాఖ్యానించారు. మరి.. ఓవైసీ బ్రదర్స్ వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.